Terror Suspects: ఉగ్రదాడి కుట్ర కేసులో నాలుగో రోజు ముగిసిన సిరాజ్, సమీర్ ల విచారణ
ఉగ్రదాడి కుట్ర కేసులో నాలుగో రోజు ముగిసిన సిరాజ్, సమీర్ ల విచారణ
Terror Suspects : ఉగ్రదాడుల కుట్రకేసులో అరెస్ట్ అయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ ల విచారణ కొనసాగుతోంది. విజయనగరం పోలీసు ట్రైనింగ్ కాలేజీలోని ప్రత్యేక గదుల్లో ఇద్దరిని వేరువేరుగా పెట్టి అధికారులు విచారిస్తున్నారు. నాలుగోరోజు విచారణలో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్‌ఐఏ(NIA), ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి ప్రశ్నలు సంధించారు. మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ఏటీఎస్ అధికారులూ విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలకు చేరుకున్నారు. సిరాజ్, సమీర్‌ల ద్వారా విజయనగరం సహా పలు ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు, ఐసిస్ లేదా ఇతర ఉగ్ర సంస్థలు వారిని ప్రేరేపించినట్లు విచారణలో నిర్ధారణకు వచ్చారని సమాచారం. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సిరాజ్ కుటుంబం, అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. సిరాజ్ ల్యాప్‌టాప్‌లో ఉన్న వివిధ అంశాలపైనా కూపీ లాగారు.
ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఉగ్రవాద సానుభూతిపరులతో సంబంధాలున్న సిరాజ్, సమీర్ ను వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీ సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది. ఎన్ఐఏ(NIA), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్‌బీ బృందాలు విజయనగరంలో మకాం వేశాయి. మూడు రోజులుగా జరిగిన విచారణలో నిందితులు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. కాగా దేశ, విదేశాలకు సిరాజ్, సమీర్ నెట్‌వర్క్ విస్తరించింది. వరంగల్‌కు చెందిన మొహిద్దీన్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బాధల్, మరో ఆరుగురు కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాలలో సిరాజ్, సమీర్‌లు జరిపిన పూర్తి చాటింగ్‌పై దర్యాప్తు బృందాలు ఓ అవగాహనకు వచ్చాయి.
సిరాజ్ గత నవంబర్ 22న ముంబైకి వెళ్లినప్పుడు 10 మందితో కలిసి హక్ ఇండియాలో లైవ్ సెషన్‌కు హాజరైనట్లు విచారణలో తెలిసింది. అక్కడ ఎవరెవరిని కలిశాడు.. అక్కడి నుంచి ప్లాన్, పేలుడు సామగ్రి తీసుకువచ్చాడా? అనే కోణంలోనూ అధికారులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా ఈ ఏడాది జనవరి 26 ఢిల్లీకి ఏ పని మీద వెళ్లాడు.. అక్కడ ఎవరిని కలిశాడనీ ప్రశ్నించారని తెలిసింది. బిహార్‌కు చెందిన అబూతాలెం అలియాస్ అబూముసబ్ సూచనలతో సిరాజ్, సమీర్‌లు సిగ్నల్ యాప్ ద్వారా జిహాదీ కార్యక్రమాలను తెలుసుకునేవారు. ఇందుకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఇతరుల ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుని అటువైపు ఆకర్షితులైనట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
Terror Suspects – విజయనగరంలో నాలుగు చోట్ల పేలుళ్ళకు సిరాజ్ ప్లాన్
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్‌లను వరుసగా నాలుగో రోజు దిల్లీ ఎన్‌ఐఏ(NIA) అధికారులు విచారించి కీలక వివరాలు రాబట్టారు. పేలుళ్లకు విజయనగరమే తన మొదటి టార్గెట్ అని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. అయితే, హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండ్లర్ తనకు సూచించారని, ప్రశాంతంగా ఉన్న విజయనగరమే తన లక్ష్యమని వాళ్లకు చెప్పానని సిరాజ్ విచారణలో వెల్లడించాడు. పేలుళ్ల కోసం సౌదీలో శిక్షణ తీసుకున్నట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది. పేలుళ్ల కోసం విజయనగరంలో ప్రధానంగా 4 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు పేలుళ్లపై పాకిస్థాన్‌లో శిక్షణ తీసుకున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో సమీర్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
Also Read : Vallabhaneni Vamsi: వంశీకి షాక్ ఇచ్చిన నూజివీడు కోర్టు ! బెయిల్ పిటిషన్ కొట్టివేత !
