Miss World 2025: ప్రపంచ సుందరిగా థాయ్ లాండ్ సుందరి ‘సుచాత’

ప్రపంచ సుందరిగా థాయ్ లాండ్ సుందరి ‘సుచాత’

Miss World 2025 : హైదరాబాద్ వేదిక నిర్వహించిన మిస్ వరల్డ్ 2025లో పోటీలు కన్నుల పండుగ ముగిసాయి. ఈ పోటీల్లో థాయ్‌లాండ్‌ భామ ఓపల్‌ సుచాత మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్‌గా ఇథియోపియా భామ హాసెట్‌ డెరెజే, రెండో రన్నరప్‌గా మిస్‌ పోలండ్‌ మయా క్లైడా, మూడో రన్నరప్‌గా మార్టినిక్‌ భామ ఆరేలి జోచిమ్‌ నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో విజేతలను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో జూలియా మోర్లే ప్రకటించారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్స్‌ జరిగాయి. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయ్‌లాండ్‌(Thailand) భామ ఓపల్‌ సుచాతకు మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టినా పిజ్కోవా కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ అందనుంది. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ స్టూడెంట్, మోడల్‌. 2024 మిస్‌ యూనివర్స్‌ థాయ్‌లాండ్‌ పోటీల్లో మూడో రన్నరప్‌గా నిలిచిన ఆమెకు త్రుటిలో కిరీటం చేజారింది. ఈసారి మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి భామగా నిలిచారు. భారత్‌ తరఫున పోటీల్లో పాల్గొన్న నందిని గుప్తాకు నిరాశే ఎదురైంది. టాప్‌-20కి ఆమె పరిమితమైంది.

హైదరాబాద్‌ వేదికగా మూడు వారాలపాటు జరిగిన మిస్‌వరల్డ్‌(Miss World 2025) పోటీలు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. శనివారం నాటి ఫైనల్‌ పోటీలు అన్నిదేశాల సుందరీమణుల పరిచయం, ర్యాంప్‌వాక్‌తో ప్రారంభమయ్యాయి. డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ డిజైన్‌ చేసిన తెలంగాణ(Telangana), భారతీయ సంప్రదాయ పట్టు వస్త్రాలతో ముద్దుగుమ్మలు మరింత మెరుస్తూ సభికులకు అభివాదం చేశారు. ఆ తర్వాత టాప్‌ 40లోకి అర్హత సాధించిన దేశాలను ఖండాల వారీగా వేదికపై ఆహ్వానించారు. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానాలో ఒక్కో ఖండం నుంచి పది మందికి చోటు కల్పించారు. తర్వాత టాప్‌ 20, టాప్‌ 8ను ఎంపిక చేశారు. మిస్‌ వరల్డ్‌గా గెలిస్తే ఏం చేస్తారనే ఉమ్మడి ప్రశ్నను వీరిని అడిగారు. 45 సెకన్లలో అత్యుత్తమంగా సమాధానం చెప్పిన నలుగురిని ఆయా ఖండాల విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో ప్రపంచ సుందరిని తేల్చేందుకు న్యాయనిర్ణేతలు ప్రశ్నలు అడిగారు. ఇచ్చిన సమాధానాల ఆధారంగా మిస్‌ వరల్డ్‌ 2025గా థాయ్‌లాండ్‌ భామను ప్రకటించారు.

Miss World 2025 – న్యాయ నిర్ణేతలు వీరే

పోటీలకు నటులు సోనూసూద్, రానా దగ్గుబాటి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, మిస్‌ వరల్డ్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌ సుధారెడ్డి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, మాజీ మిస్‌ ఇండియా నమ్రత శిరోద్కర్, మాజీ మిస్‌ ఇంగ్లాండ్‌ కెరినా టిర్రెల్, 72వ మిస్‌వరల్డ్‌(Miss World 2025) అఫిషియల్‌ స్టేజ్‌ డైరెక్టర్‌ డోనా వాల్ష్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా జూలియా మోర్లే ఉన్నారు. 2016 మిస్‌వరల్డ్‌ స్టెఫాని డెల్, ప్రజెంటర్‌ సచిన్‌ కుంభార్‌ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఫైనల్‌ పోటీల్లో అలరించిన నృత్యాలు

బాలీవుడ్‌ తారలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, ఇషాన్‌ ఖట్టర్‌ నృత్య ప్రదర్శనలతో అలరించారు. నాటు నాటు తెలుగు పాటకు స్టెప్పులతో ఆడిటోరియం దద్దరిల్లింది. మిస్‌ ఇండియా నందిని గుప్తాతో సహా మిగతా పోటీదారులు వారి స్థానాల్లోనే పాటకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ అలరించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దంపతులతోపాటు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు, ఇతర సినీ ప్రముఖులు, తెలంగాణ(Telangana) పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్, సీఎం రమేశ్, నటి కుష్బూ, నటుడు మహేశ్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితార, తదితరులు పాల్గొన్నారు.

పలువురు విదేశీ అతిథులు

పోటీల్లో పాల్గొన్న సుందరీమణుల తల్లిదండ్రులు, బంధువులు పలువురు ఫినాలేకు వచ్చారు. విజేత మిస్‌ థాయ్‌లాండ్‌ సమీప బంధువులతోపాటు ఫిలిప్పీన్స్‌ సహా ఇతర దేశాల నుంచి పలువురు పాల్గొన్నారు. 3,500 మంది ప్రత్యక్షంగా పోటీలను తిలకించగా… ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో టీవీల్లో, ఓటీటీల్లో ప్రత్యక్ష ప్రసారంలో కోట్ల మంది వీక్షించారు. అట్టహాసంగా జరిగిన పోటీలు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమై రాత్రి 9.30 గంటలకు వరకు సాగాయి.

తెలంగాణలో(Telangana) ప్రపంచ సుందరి పోటీల సందడి మూడు వారాలకు పైగా కొనసాగింది. మే నెల ఆరు, ఏడు తేదీల్లో వివిధ దేశాల భామలు హైదరాబాద్‌కు చేరుకోగా అదే నెల 10న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోటీలు ప్రారంభించారు. శనివారం రాత్రి 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు ముగిసినట్లు నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు.

ఎంపిక ఎలా జరిగిందంటే ?

మిస్‌ వరల్డ్‌(Miss World 2025) పోటీలో 108 దేశాల భామలు పోటీపడ్డారు. వేర్వేరు పోటీల అనంతరం టాప్‌ 40 వీరిని ఎంపిక చేశారు. 16 మంది పోటీల ద్వారా విజేతలుగా నిలిచి ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో రాగా… మిగిలిన 24 మందిని జడ్జీల ఛాయిస్‌ గా ఎంపిక చేశారు. మొత్తంగా ఒక్కో ఖండం తరఫున 10 మందిని ఎంపిక చేశారు. తదుపరి రౌండ్‌లో ఒక్కో ఖండం తరఫున ఐదుగురిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ రౌండ్‌లో ఒక్కో ఖండం తరఫున ఇద్దరిని ఎంపిక చేశారు. మీరు మిస్‌ వరల్డ్‌ అయితే ఏం చేస్తారని ఉమ్మడి ప్రశ్న అడిగారు. అత్యుత్తమ సమాధానం చెప్పిన నలుగురు ఆయా ఖండాల విజేతలుగా తుది రౌండ్‌లోకి అడుగుపెట్టారు. వీరిని జడ్జీలు ప్రశ్నలు అడిగారు. అత్యుత్తమ సమాధానం చెప్పిన థాయ్‌లాండ్‌ భామ ఓపల్‌ సుచాత ప్రపంచ సుందరిగా నిలిచారు. ఫస్ట్‌ రన్నరప్‌గా మిస్‌ ఇథియోపియా, రెండో రన్నరప్‌ మిస్‌ పోలండ్, థర్డ్‌ రన్నరప్‌గా మిస్‌ మార్టినిక్‌ నిలిచారు.

ఫైనల్ రౌండ్ లో అడిగిన ప్రశ్నలు ఇవే

ప్రశ్న: మిస్‌ వరల్డ్‌ ప్రయాణం నిజాయతీ, వ్యక్తిగత బాధ్యత గురించి ఏమి నేర్పింది?

మిస్‌ థాయ్‌లాండ్‌: మిస్‌వరల్డ్‌ వేదికపై ఉండటం జీవితంలో నాకు లభించిన అతిపెద్ద అవకాశం. ఈ ప్రయాణం నాకు చాలా అంశాలు నేర్పింది. ప్రజలను నడిపించడానికి ఉత్తమ మార్గం మీ చర్యలతో గౌరవప్రదంగా వ్యవహరించడమే. మాటలకంటే చేతలే గొప్పవి. నేను ఎప్పుడైనా నమ్మేది ఒకటే.. మీరు ఎవరైనా కావచ్చు, మీ వయసు ఎంతైనా కానీ, మీరు ఎలాంటి హోదాను కలిగి ఉన్నా మీ పక్కన ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ఉంటారు. వారు చిన్నపిల్లవాడైనా, పెద్దవాడైనా, మీ తల్లిదండ్రులైనా కావొచ్చు. వారే మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు.

ప్రశ్న: తప్పుడు సమాచారం నిండిన ప్రపంచంలో మీలాంటి వారు సత్యం, గౌరవం, కృతజ్ఞతతో ఎలా నాయకత్వం వహించగలరు?

మిస్‌ మార్టినిక్‌: నన్ను నేను ఒక భవిష్యత్తు నాయకురాలిగా భావిస్తున్నా. మనకు ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారం, వార్తలు నిజమో కాదో మనకు తెలియదు. మనం సమయం తీసుకొని, ప్రతి సమాచారాన్ని అర్థం చేసుకోవాలి.

ప్రశ్న: మిస్‌ వరల్డ్‌ అనేది ఉద్దేశం బలమైన లక్ష్యం కోసం నిలబడుతుంది. దీని నిజమైన అర్థాన్ని తప్పుగా చిత్రీకరించే వారిపై మీరు ఎలా స్పందిస్తారు?

మిస్‌ ఇథియోపియా: మిస్‌ వరల్డ్‌ ఇథియోపియాగా నా దేశంలో కూడా నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నా. చాలా మంది మిస్‌ వరల్డ్‌ అనేది కేవలం ఒక అందాల పోటీ అని భావిస్తారు. కానీ అది అంతకంటే ఎక్కువ. నా వెనుక చాలా మంది పిల్లలు, తల్లులు ఉన్నారు, వారు నా నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు. నేను ఇంత దూరం వచ్చిన తొలి ఇథియోపియన్‌ని. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడికి చేరుకోవడం నా కోసం లేదా నా దేశం కోసం మాత్రమే కాదు. బయట ఉన్న తల్లులు, పిల్లల కోసం. నా ఉద్దేశం మనం దేన్నయినా చేయగలమని నిరూపించి చూపడం.

ప్రశ్న: తెలంగాణలోని మీ అనుభవాల గురించి ఏం చెబుతారు

మిస్‌ పోలండ్‌: నేను సిగ్గరిని. దీన్ని ఇక్కడ అధిగమించగలిగాను. ఇప్పుడు నేను ఇతరులతో ఎంతో సంతోషంగా కలసి ఉండగలుగుతున్నా. నాకు ఇష్టమైన విషయం ప్రజలను నిరంతరం కలవడం, వారి నుంచి నేర్చుకోవడం, స్ఫూర్తి పొందడం. తెలంగాణలో(Telangana) నా అందమైన అనుభవం ఇక్కడి ఆతిథ్యం. ఎందుకంటే ఈ దేశం, ఇక్కడి ఆతిథ్యం నా దేశాన్ని గుర్తు చేసింది. చిరునవ్వుతో, ఆప్యాయతతో స్వాగతించారు. నాకు అత్యంత గుర్తుండిపోయిన అనుభవం ఏఐజీ హాస్పిటల్‌కు మేము వెళ్లినపుడు అక్కడి ప్రజలు బాధల్లో ఉండి కూడా మాతో చాలా ఆప్యాయంగా ఉన్నారు. ప్రజల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని నేను భావిస్తున్నా.

Also Read : Lalu Prasad Yadav: ఢిల్లీ హైకోర్టులో లాలూకు చుక్కెదురు

Leave A Reply

Your Email Id will not be published!