CM Revanth Reddy: బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధం – సీఎం రేవంత్‌రెడ్డి
బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధం - సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : బనకచర్ల-గోదావరి ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు తాము సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బనకచర్ల అంశం గురించి కూర్చొని మాట్లాడుకుంటే వివాదం ఉండదని… దానికి తాము ఏప్పుడూ సిద్ధమన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ (CM Revanth Reddy) … అక్కడి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్ (పీఎఫ్‌ఆర్) ఇవ్వడం వల్లే వివాదం మొదలైంది. పీఎఫ్‌ఆర్ ఇచ్చేముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేదికాదు. ఆంధ్రప్రదేశ్ పీఎఫ్‌ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోంది. బనకచర్లపై (Banakacherla) కేంద్రం అన్ని రకాల చర్యలకు సిద్ధమైంది.
ఇద్దరు సీఎంలు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దాం. ఒక రోజు కాదు నాలుగు రోజులైనా చర్చిద్దాం. రాష్ట్రాల మధ్య జలవివాదాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయి. న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం. వివాదాల పరిష్కారంలో నాకెలాంటి బేషజాలు లేవు. ఇద్దరు వ్యక్తులు కాదు… రాష్ట్రాల మధ్య వ్యవహారం ఇది. విభజనచట్టం ప్రకారం ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే చెప్పుకోవాలి. విభజన చట్టం ప్రకారం గతంలో సీఎంల స్థాయిలో చర్చలు జరిపాం. అనేక అంశాలను సీఎం స్థాయిలో చర్చించాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
CM Revanth Reddy – మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సపోర్టు తప్పనిసరి
‘‘తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దు. పైన, కింద ఉన్న రాష్ట్రాలతో వివాదం కోరుకోవట్లేదు. కింది రాష్ట్రంగా ఏపీకి హక్కులు ఉన్నాయంటున్నారు. అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయి. ఈనెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్‌లో బనకచర్లపై చర్చిస్తాం. ఒక అడుగు ముందుకేసి మేమే ఏపీని చర్చలకు పిలుస్తాం. మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సపోర్టు కావాలి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే గోదావరి నీటిని తరలించాలి. విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉంది. బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు.
బనకచర్లపై తెలంగాణ అభిప్రాయం తప్పక తీసుకోవాల్సిందే. 2016, 2018లో ఏపీ సర్కారు రెండు జీవోలు ఇచ్చింది. ఏపీ జీవోల ఆధారంగా వ్యాప్కోస్ 150 పేజీల నివేదిక ఇచ్చింది. గోదావరి-పెన్నా అనుసంధానంలో బనకచర్ల ఒక భాగం. 86 రోజుల్లో 400 టీఎంసీలు తరలించేలా బనకచర్ల డిజైన్ చేశారు. గోదావరిలో 968 టీఎంసీలు వాడే వెసులుబాటు తెలంగాణకు ఉంది. కేటాయించింది వాడుకునేందుకు అవకాశం ఇవ్వట్లేదు. కేటాయింపులు వాడుకునే అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదం. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిది. ఈ వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్‌లైన్ లేదు’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : MLC Kodandaram: బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు
