Minister Nara Lokesh: సూర్య నమస్కారాలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విశాఖ విద్యార్ధులు

సూర్య నమస్కారాలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విశాఖ విద్యార్ధులు

Nara Lokesh : ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఈ సూర్య నమస్కారాలతో యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిందని… దీనికి మనం గర్వపడాలని ఆయన తెలిపారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రలో (Yogandhra) భాగంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డ్ సృష్టించేలా 25 వేల మంది అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులు చేస్తున్న సూర్య నమస్కారాలను మంత్రి లోకేష్ (Nara Lokesh) ఆశక్తిగా తిలకించారు.

Nara Lokesh Key Comments on Yoga Day Preparations

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ… ఈ రోజు గిరిజన విద్యార్థులను చూస్తుంటే నాకు గుర్తుకువచ్చేది కమిట్ మెంట్, పట్టుదల. 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు మీరు ఆనాడు చేసినప్పుడు మేం అందరం ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపుతో మీరంతా కష్టపడి దేశంతో పాటు ప్రపంచం మనవైపు చూసేలా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు. యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ (Vizag) వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ రోజు మన గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు.

దాదాపు 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ఇదొక వరల్డ్ రికార్డ్. దీనిని రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధాని గారి తరపున, ముఖ్యమంత్రి గారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని, ఎన్నడూ జరగని విధంగా చేసి చూపిస్తామని ప్రధాని గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. దీంతో ఎన్నడూ లేనివిధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని గిన్నీస్ రికార్డ్ సృష్టించబోతున్నారని తెలియజేస్తున్నా.

యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో యోగా చేపించేవారు. ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని. ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను. అదే క్రమశిక్షణ, పట్టుదల మీ అందరిలో ఉంది. దీనిని మరువొద్దు. ఏ ఆశయాల కోసం మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాల కోసం నడవండి. విజన్ తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. మనం అందరం కలలు కనాలి. మన కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశాన్ని మార్చాలనే కలలు కనాలి. అందుకోసం కష్టపడి పనిచేయాలి. పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయం పెట్టుకున్నామో దానిని సాధించాలని కోరుతున్నా. మంత్రి సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. ఏ పట్టుదలతో విద్యార్థులు సూర్యనమస్కారాలు చేశారో మా అందరిపై బాధ్యత పెరిగింది.

ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా

జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ దినేష్ కుమార్ గారిని కూడా నేను అభినందిస్తున్నా. ఏడాది కాలంగా విద్యార్థులతో అద్భుతంగా ప్రాక్టీస్ చేయించారు. మాస్టర్ గారు కూడా పట్టుదలతో శిక్షణ ఇచ్చారు. ఈ రోజు విద్యార్థులు చరిత్ర సృష్టించారు. ఇందుకు విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు.

మోదీ గారికి కానుకగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చాం

ఆంధ్రులుగా మన కోరికలన్నీ గౌరవ ప్రధాని గారు తీరుస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపారు. విశాఖకు రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన ప్రజారాజధాని అమరావతి పనులు ప్రారంభించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎన్టీపీసీ లాంటి సంస్థలు కావాలని అడిగితే ఇచ్చారు. ఏపీ అన్నా, విశాఖ అన్నా ప్రధాని గారికి చాలా ప్రేమ. ఏడాదిలో రెండో సారి ప్రధాని విశాఖ వస్తున్నారు. ఆయనకు ఒక కానుకగా ఈ రోజు మనం అందరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చాం.

దేవాన్ష్ గుర్తుకువస్తున్నాడు

మిమ్మల్నందరినీ చూస్తుంటే మా అబ్బాయి దేవాన్ష్ గుర్తుకువస్తున్నాడు. మీ అందరిలో ఉన్న క్రమశిక్షణ, పట్టుదలను దేవాన్ష్ కు నేర్పించాల్సిన అవసరం ఉంది. మాస్టర్ గారు ఏ ఆదేశాలైతే ఇచ్చారో క్రమశిక్షణ, పట్టుదలతో పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని, దేశానికే దిశానిర్దేశం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సీఎస్ విజయానంద్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎం.టి కృష్ణబాబు, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!