YS Jagan: జగన్‌ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ కీలక రిపోర్టు

జగన్‌ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ కీలక రిపోర్టు

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని, ముప్పు లేదని కేంద్ర ఇంలిటిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నివేదించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రతను పునరుద్దరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఎన్ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో సెక్యురిటీ కల్పించాలని పిటిషన్‌లో జగన్ కోరారు.

ఏపీ హైకోర్టులో మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇప్పటికే 58 మందితో జగన్‌కి జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసు విచారణ జులై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

YS Jagan – జగన్‌ ను డిస్‌క్వాలిఫై చేయాల్సిందే – ఎమ్మెల్యే గంటా

మాజీ సీఎం జగన్ (YS Jagan) రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారని మండిపడ్డారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర సూపర్ సక్సెస్ అవడాన్ని జగన్ (YS Jagan) జీర్ణించుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. ఈ అంశాన్ని డైవర్షన్ చేసేందుకు పరామర్శల పేరుతో నాటకాలాడారని విమర్శించారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేశాడని ఫైర్ అయ్యారు. చనిపోయిన సింగయ్య మా పార్టీ వ్యక్తి, మీకేంటి బాధ అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మానవత్వం ఉంటే ఇప్పటికైనా సింగయ్య ఇంటికి వెళ్లి మాట్లాడి క్షమాపణ చెప్పి ఉండేవారన్నారు. ఆస్తి కోసం చెల్లిని, తల్లిని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరూ చూశారని గంటా గుర్తు చేశారు.

నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా అంటూ ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్న జగన్.. నాడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ను ఎలా అడ్డుకున్నారో అందరికీ గుర్తుందన్నారు గంటా. జగన్ మాటలు చూస్తుంటే దెయ్యాల వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. 151 నుంచి 11కు ఎలా పడిపోయావో తెలుసుకోవాలని హితవుపలికారు. జగన్ తన ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘జగన్… ఇవి ప్రమాదాలు కాదు.. నువ్వు చేసిన హత్యలు.. ఇలాంటి వ్యక్తులను డిస్‌క్వాలిఫై చేయాలి. అసెంబ్లీకి రాని వ్యక్తి , రాజీనామా చేయాలి’ అని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

అన్నింటికీ జగనే కారణం – యనమల

ఆపరేషన్ మాఫియా పేరిట రాష్ట్రంలో జగన్ రక్తపాతం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని చూపించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని విధ్వంసకర వ్యూహాలకు జగనే మూలకారణమన్నారు. జగన్ చేసే కుట్రలను విజ్ఞులైన ప్రజలు విశ్వసించరని తెలిపారు. జగన్ చర్యలు సోషలిజం, అంబేడ్కర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాజకీయ యుద్ధం సృష్టించే రాబందు చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Also Read : Bomb Blast: బై ఎలక్షన్‌ విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి ! బాలిక మృతి !

Leave A Reply

Your Email Id will not be published!