Shubhanshu Shukla Messsage: అంతరిక్షం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మెసేజ్
అంతరిక్షం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మెసేజ్
Shubhanshu Shukla : కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరి వ్యోమనౌక తాజాగా భూకక్ష్యలోకి ప్రవేశించి అక్కడ ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) భారత పౌరులను పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణం అని పేర్కొన్నారు.
Shubhanshu Shukla Message
‘‘నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోంది. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు… భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది. ఈ ప్రయాణంలో మీరంతా భాగమవ్వాలని కోరుకుంటున్నా. మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని మనమంతా కలిసి ప్రారంభిద్దాం. జై హింద్. జై భారత్’’ అని శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తన సందేశంలో పేర్కొన్నారు.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వీరు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వీరి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు.
శుభాంశు రోదసియాత్రపై మోదీ, ముర్ము స్పందన
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు స్పందించారు.
‘భారత్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించారు. మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది. మీరు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు ప్రపంచమంతా ఒకే కుటుంబమని నిరూపించారు. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఇక, భారత్, హంగేరీ, పోలాండ్, యూఎస్ వ్యోమగాలులతో కూడిన అంతరిక్ష మిషన్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఈసందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. కోట్లమంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని వెల్లడించారు.
Also Read : Minister Nara Lokesh: పార్వతీపురం విద్యా శాఖ అధికారులపై మంత్రి లోకేష్ సీరియస్
