Shubhanshu Shukla: భార్యకు కెప్టెన్ శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం
భార్యకు కెప్టెన్ శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం
Shubhanshu Shukla : భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రికార్డు సృష్టించారు. అనేక అవాంతరాల అనంతరం జూన్ 25, 2025న యాక్సియం మిషన్-4లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, అతని ముగ్గురు సహచరులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి విజయవంతంగా చేరుకున్నారు. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. అయితే,చరిత్ర సృష్టించే ముందు కెప్టెన్ శుభాన్షు శుక్లా తన భార్య కామ్నా కోసం ఒక భావోద్వేగపూరిత లేఖ రాశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి యాక్సియంమిషన్-4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి బయలుదేరింది కెప్టెన్ శుభాంశు శుక్లా బృందం. అంతకుముందే, కెప్టెన శుభాంశు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో ఇలా రాశారు. ‘మేము జూన్ 25 తెల్లవారుజామున భూమి నుండి బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. విజయవంతంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ మాపై ప్రేమ చూపుతున్న అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
భార్యను ఉద్దేశిస్తూ ‘అద్భుతమైన భాగస్వామిగా ఉన్నందుకు కామ్నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు లేకుండా ఇవేవీ సాధ్యం కాలేదు. కానీ ముఖ్యంగా ఇవేవీ పెద్దగా పట్టించుకోదగ్గ విషయాలు కావు’ అని అంటూ వీడ్కోలు పలుకుతున్న చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. అదే సమయంలో, శుభాన్షు (Shubhanshu Shukla) తల్లి ఆశా శుక్లా, యాక్సియం మిషన్-4కు ముందు తన కుమారుడికి కోడలు అందించిన మద్దతును ప్రశంసించారు. ‘ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. దేశంలోని త్రివేణి నగర్‌కు చెందిన ఒక అబ్బాయి ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నారు. మా కోడలు లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ విజయంలో తను అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది’ అని ఆమె అన్నారు.
Shubhanshu Shukla – తల్లిదండ్రులకు కూడా శుభాంశు ప్రత్యేక సందేశం
భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. మన దేశం నుంచి రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్లా రోదసియాత్రకు పయనమయ్యారు. ఈ ప్రయాణానికి ముందు శుక్లా తన కుటుంబసభ్యులకు ప్రత్యేకమైన సందేశం పంపారు.
‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అని శుభాంశు (Shubhanshu Shukla) కుటుంబసభ్యులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక, ప్రయాణానికి ముందు ఆయన తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు. శుభాంశు తల్లి చక్కెర, పెరుగు కలిపిన పదార్థాన్ని ఆయనకు వర్చువల్‌గా తినిపించారు. శుభాంశు రోదసియాత్రపై ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇది మాకు ఎంతో గర్వంగా ఉంది. ఏమాత్రం భయపడటం లేదు. శుభాంశుని వెళ్లి మిషన్ పూర్తి చేయమని చెప్పాం’ అని ఆమె పేర్కొన్నారు. ఇక, ఆయన సోదరి మాట్లాడుతూ.. ఈ కన్నీళ్లు ఆనందంతో వస్తున్నాయన్నారు. తాము సంతోషంగా, గర్వంగా ఉన్నామని తెలిపారు. ఇక, ఈ మిషన్ ప్రయోగాన్ని శుభాంశు కుటుంబసభ్యులు కూడా వీక్షించారు. ఆ సమయంలో వారంతా భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : Police: దొంగకు చెప్పులదండ వేసి ఊరేగించిన పోలీసులు
