CM Revanth Reddy: పాశమైలారం బాధితుల పరామర్శ ! మృతులకు కోటి చొప్పున పరిహారం !
పాశమైలారం బాధితుల పరామర్శ ! మృతులకు కోటి చొప్పున పరిహారం !
CM Revanth Reddy : పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 46 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడి… ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
పాశమైలారం పారిశ్రామిక వాడ విషాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి, వారి ఆవేదనను పంచుకున్నానన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వారి బాధను అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రభుత్వం వైపు నుండి… వారికి తక్షణం అందాల్సిన, దీర్ఘ కాలికంలో చేయాల్సిన సహాయంపై అక్కడికక్కడే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చానని వివరించారు.
బాధితులను గుర్తించడం, తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, ఇతర అవసరాలతోపాటు.. పసి బిడ్డలు ఉన్న వాళ్ల విషయంలో వారికి కావాల్సిన అవసరాలు.. ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చానన్నారు. బాధిత కుటుంబాలు.. ఈ గాయం నుండి కోలుకుని తిరిగి జీవనం సాగించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
CM Revanth Reddy – మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం – సీఎం రేవంత్
పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని (Pashamylaram) సిగాచీ ఔషధ పరిశ్రమ ప్రమాద స్థలిని మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధితుల పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్లో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిశ్రమలకు స్పష్టమైన సూచనలు ఇస్తామన్నారు.
పాశమైలారం ఘటన దురదృష్టకరం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 48 మంది మృతదేహాలు సంఘటన స్థలంలో లభ్యమయ్యాయని చెప్పారు. ఇంకా 11 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఘటన స్థలాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ… ఈ సంస్థ ఫార్మా కంపెనీలకు రా మెటీరియల్ అందిస్తుందన్నారు. గతంలో సైతం ఒక పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 11 మంది చనిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు. పరిశ్రమల్లో తనిఖీలు, లంచాల కోసం జరుగుతున్నాయా..? లేక నామ్ కి వాస్తు ప్రకారం జరుగుతున్నాయా..? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పొట్ట కూటి కోసం వచ్చి… ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో 46 మంది చనిపోవటం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. సిగాచి సంస్థలకు మరో మూడు పరిశ్రమలు ఉన్నాయని… వాటిని సైతం తనిఖీ చేయాలన్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి జాబితా వచ్చిన తర్వాత ఆ యా రాష్ట్రాల వారికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పరిశ్రమల ప్రాంతంలో కచ్చితంగా అంబులెన్స్ ఉండే విధానం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకరిస్తామని స్పష్టం చేశారు.
శిధిలాల కింద మృతదేహాల కోసం పోలీస్ జాగిలాలను వినియోగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్జప్తి చేశారు. చనిపోయిన కుటుంబ సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతానంటే వారికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదంటూ విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా సమాధానమిచ్చారు.
Also Read : Minister Uttam Kumar Reddy: బనకచర్లపై మా వాదనతో కేంద్రం ఏకీభవించింది – మంత్రి ఉత్తమ్
