DK Shiva Kumar: కర్ణాటక సీఎం మార్పుపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు
కర్ణాటక సీఎం మార్పుపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు
DK Shiva Kumar : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదని అన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు.
DK Shiva Kumar Comments
డి.కె.శివకుమార్ (DK Shiva Kumar) త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్‌కు నోటీసు ఇస్తామని, ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చిచెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. అలాంటి అంశాలపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని పేర్కొన్నారు.
అవును నేను అదృష్టవంతుడినే – సీఎం సిద్ధరామయ్య
తనను అదృష్టవంతుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పందించారు. ‘అవును.. నేను అదృష్టవంతుడినే. అందుకే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను’ అన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పట్ల అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే బీఆర్ పాటిల్… మంగళవారం ‘‘సిద్ధరామయ్య లాటరీ కొట్టారు. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసింది నేను. ఆయన అదృష్టం బాగుండి సీఎం అయ్యారు. నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు. నేను సూర్జేవాలాను కలిసి చెప్పాల్సిందంతా చెప్పా. ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో చర్చనీయాంశంగా మారడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు.
మరోవైపు, తన నియోజకవర్గం అలంద్‌లో పేదలకు ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఇటీవల ఆరోపించారు. వీటిని తోసిపుచ్చిన గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కేటాయింపులు పారదర్శకంగానే జరుగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పాటిల్ విమర్శల తర్వాత మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజు కాజే, బేలూర్ గోపాల కృష్ణ సైతం తమ సొంత ప్రభుత్వంపై అసంతృప్తిని బయటపెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు, పార్టీలో ఉన్న అసమ్మతిని నియంత్రించేందుకు అధిష్ఠానం ఆదేశాల మేరకు రణ్‌దీప్ సూర్జేవాలా బెంగళూరు చేరుకొని ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాయకత్వ మార్పులేదని స్పష్టం చేశారు. సీఎం మార్పు ఊహాగానాల వెనక భాజపా కుట్ర ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు నిలిచిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోందన్నారు.
Also Read : Minister Jaishankar: నేరస్థులకు శిక్ష పడాల్సిందే – పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్
