Shubhanshu Shukla: యూపీ, కేరళ విద్యార్థులతో ముచ్చటించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా

యూపీ, కేరళ విద్యార్థులతో ముచ్చటించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని అడుగుపెట్టిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా… కేరళ, యూపీ విద్యార్ధులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అంతరిక్షం నుండి విద్యార్ధులతో ముచ్చటించారు. అంతరిక్షంలోని తన అనుభవాలను వారికి కళ్ళకు కట్టినట్లు వివరించారు. దీనితో కేరళ, ఉత్తరప్రదేశ్‌ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను (Shubhanshu Shukla) చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు.

Shubhanshu Shukla Discuss With

శుక్లా (Shubhanshu Shukla) స్వస్థలం అయిన లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్‌ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్‌ఎస్‌కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్‌ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు.

‘‘ఐఎస్‌ఎస్‌లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్‌ కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్‌ బ్యాగ్‌ ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీనితో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా (Shubhanshu Shukla) అన్నారు.

‘‘ఒంటరిగా ఉన్నామని ఫీల్‌ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్‌గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్‌ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్‌ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్‌’తో చెప్పింది.

వాళ్ల ప్రశ్నలకు శుక్లా (Shubhanshu Shukla) వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్‌ఎస్‌లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్‌లోని నయార్‌కుళి ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు.

అనారోగ్యం తలెత్తితే కోలుకునేందుకు అవసరమైన మందులన్నీ తాము వెంట తీసుకువెళ్తామని శుక్లా (Shubhanshu Shukla) తెలిపారు. తమకు ఖాళీ సమయమంటూ దొరకదని, ఒకవేళ దొరికితే మాత్రం ఏదో ఒక ఆటలాడుతుంటామని చెప్పారు. బయటకు చూడటం, ముఖ్యంగా భూగోళాన్ని వీక్షించడం అద్భుతంగా ఉంటుందని, దానికోసమే ప్రతిఒక్కరూ తాపత్రయపడుతుంటామని వివరించారు. గురుత్వాకర్షణ లేకపోవడం మన శరీరాలకు పెను సవాల్‌ అనీ, ఐఎస్‌ఎస్‌కు చేరిన రోజుకంటే ఇప్పుడు తన పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. ‘తిరిగి భూమికి చేరుకోగానే గురుత్వాకర్షణకు అలవాటు పడటం మరో సవాల్‌. దానికోసం చాలా సన్నద్ధత అవసరమవుతుంది. మేం తెచ్చుకునే ఆహారంలో దాదాపు అంతా ముందుగా ప్యాక్‌ చేసిందే. వాటిలో తగిన పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మాకు ప్రేరణను, ఉల్లాసాన్ని ఇచ్చేవాటిలో ఆహారం ఒకటి. చాలారకాల ఆహారం మాకు అందుబాటులో ఉంటుంది. మేం ఇష్టపడేవాటినే ప్యాక్‌ చేస్తారు’ అని శుక్లా చెప్పారు.

ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఐఎస్‌ఎస్‌ నుంచే మాట్లాడుతుంటామని తెలిపారు. భూమ్మీద ఉన్నప్పుడు గురుత్వాకర్షణ వల్ల మన శరీరంపై బరువు ఉంటుందని, నిలబడినా, నడిచినా, కూర్చొన్నా కండరాలను వాడుతుంటామని చెప్పారు. అంతరిక్షంలో ఇదేమీ ఉండదు కాబట్టి కండరాల్లో సమస్య రాకుండా కసరత్తులు చేయడం ఎంతో ముఖ్యమని వివరించారు. తమవద్ద ఉండే సైకిల్‌ను, వ్యాయామ యంత్రాన్ని వాడుకుని ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటామంటూ అదెలా ఉంటుందో ప్రదర్శించారు. అంతరిక్షంలో అటూఇటూ ఎలా కదులుతారో, బంతితో ఎలా ఆడుకోవచ్చో ప్రత్యక్షంగా చూపించారు. విద్యార్థులంతా ఎంతో సంబరపడిపోయారు.

Also Read : Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ ప్రాథమిక కీ విడుదల

Leave A Reply

Your Email Id will not be published!