Minister Ponnam Prabhakar: సీఎం రేవంత్‌ కు బీజేపీ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌

సీఎం రేవంత్‌ కు బీజేపీ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌

Ponnam Prabhakar : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) ఫైర్‌ అయ్యారు. మోదీ సర్కార్‌ ఫెయిల్యూర్స్‌ సంగతేంటని ప్రశ్నించారు. ‘‘11ఏళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ (BJP) దేశ ప్రజలను అడుగడుగునా వంచించింది. గత 3 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని విస్మరించి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. వాగ్ధానాలతో ఊదరగొట్టడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మీరు చేసిందేమీ లేదు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ.. ఇలా అన్ని వర్గాలను వంచించిన చరిత్ర మీది. మీ వైఫల్యాలు రాస్తే రామాయణమంత.. వింటే భారతమంత. అలాంటి మీరు మా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది.

గురువింద గింజ సామెతను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ నవ్వు తెప్పిస్తోంది. తెలంగాణకు 11 ఏళ్లలో ఏం చేశారు ? తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వనప్పుడు మీరు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది భాజపా ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పదేళ్ల క్రితం ఇచ్చిన హామీ ఏమైంది? పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకి జాతీయ హోదా ఇవ్వకుండా మీన‌మేషాలు లెక్కిస్తోంది మీరు కాదా? పోలవరం ముంపుతో సంబంధం లేని 5 పంచాయతీలను ఏపీలో విలీనం చేసి భ‌ద్రాద్రి రామ‌య్య భూములును ఏపీకి అప్పనంగా అప్పగించింది మీరు కాదా?’’ అని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Ponnam Prabhakar – మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది – మంత్రి పొన్నం

తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను మంత్రి పొన్నం ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేలేని బీజేపీ నేతలు.. తమకు లేఖ‌లు రాయ‌డం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోదీ స‌ర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగ‌తేందని రామచందర్‌రావుని ప్రశ్నించారు. బీజేపీ (BJP) ప్రభుత్వం దేశ ప్ర‌జ‌ల‌ను అడుగ‌డుగునా మోసం చేసిందని ఆరోపించారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం త‌ప్ప మోదీ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. అలాంటి మీరు మా సీఎంకి లేఖ‌లు రాయ‌డం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గురువింద సామేత‌ను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ న‌వ్వు తెప్పిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు గుప్పించారు.

11 ఏళ్ల మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారని మాజీ ఎంపీ వీ.హనుమంత్ రావు ప్రశ్నించారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో హనుమంత్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి, పీర్ల పండగ శుభాకాంక్షలు తెలిపారు. మూడుసార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీనీ కలసి.. బీసీలకు వేర్వేరుగా మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని కోరామని గుర్తుచేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఓబీసీలను పైకి తీసుకురావడానికి కర్ణాటకలో ఈ నెల(జులై) 15వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనకు ఆహ్వానం పంపారని గుర్తుచేశారు హనుమంత్ రావు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎందుకు రైల్‌రోకో చేస్తుందో అర్ధం కావడం లేదని హనుమంత్ రావు విమర్శించారు. తాము 42శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే కవిత అప్పుడు రైల్ రోకో చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక న్యాయ సమరభేరి సభ విజయవంతం అయిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారని అన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడిన వాళ్లకు పదవి ఇవ్వాలని పీఏసీ సమావేశంలో చెప్పారని హనుమంత్ రావు పేర్కొన్నారు.

Also Read : Gangster: యువకుడి కొంప ముంచిన గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్

Leave A Reply

Your Email Id will not be published!