Minister Sridhar Babu: కోటి ఇళ్లకు ఇంటర్నెట్ లక్ష్యం – మంత్రి శ్రీధర్‌బాబు
కోటి ఇళ్లకు ఇంటర్నెట్ లక్ష్యం - మంత్రి శ్రీధర్‌బాబు
Sridhar Babu : టి ఫైబర్ ద్వారా తమ ప్రభుత్వం కోటి ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా… అంతర్జాతీయ విజ్ఞానాన్ని విద్యార్థులు పొందడం ఆనందంగా ఉందని ఏఐ సంబంధిత సంస్థ ‘పెర్‌ప్లెక్సిటీ’ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ‘ఎక్స్’లో ఇటీవల స్పందించారు. రీసెర్చ్ అసిస్టెంట్ ను వాయిస్ మోడ్ ద్వారా ప్రశ్నలు అడిగి, సందేహాలు నివృత్తి చేసుకుంటూ… పాఠ్యపుస్తకాలకు మించి విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారని.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Minister Sridhar Babu Comments
ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు కూడా అరవింద్ శ్రీనివాస్ కు ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో ఆదివారం ప్రతిస్పందించారు. ‘‘గత ఆగస్టులో నేను అరవింద్ శ్రీనివాస్‌ను కలిశాను. రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ (ఏఐ)కి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించాను. తెలంగాణ ప్రభుత్వం టి ఫైబర్ ద్వారా మారుమూల పల్లెల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చేస్తున్న కృషిని వివరించాను. మా ప్రభుత్వ కృషి వల్ల అడవి శ్రీరామపూర్ (హైదరాబాద్ నుంచి 230 కి.మీ. దూరం) లాంటి మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు కూడా ‘పెర్‌ప్లిక్సిటీ.ఏఐ’ వంటి సిలికాన్ వ్యాలీ-గ్రేడ్ టెక్నాలజీలను యాక్సెస్ చేయగలుగుతున్నారు. డిజిటలీకరణలో గ్రామీణ-పట్టణ అంతరాన్ని తగ్గించడానికి తెలంగాణ కట్టుబడి ఉంది. మా పురోగతిని వేగవంతం చేయడంలో మాతో కలిసి పనిచేయాలని ఆహ్వానిస్తున్నా’’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
Also Read : Minister Bhatti Vikramarka: తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ – డిప్యూటీ సీఎం భట్టి
