Visakhapatnam: మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టిన విశాఖ పోలీసులు
మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టిన విశాఖ పోలీసులు
Visakhapatnam : మానవ అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని విశాఖ (Visakhapatnam) పోలీసులు అరెస్టు చేశారు. కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు యువతీయువకులను తరలిస్తున్న ముఠాలు, సైబర్ నేరాల కేంద్రాలపై విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి చొరవతో ఉక్కుపాదం మోపారు. ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని అరెస్టు చేశామని, వారి చేతుల్లో మోసపోయిన 85 మంది అమాయకుల్ని స్వదేశానికి సురక్షితంగా రప్పించామని సీపీ తెలిపారు.
Visakhapatnam Police
‘‘కొందరు ఏజెంట్లు డేటా ఎంట్రీ ఉద్యోగం, రూ.లక్షల్లో జీతం అంటూ ఆశచూపి, ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతను మోసం చేసి ఉచ్చులో పడేస్తున్నాయి. నిరుద్యోగ యువతను నమ్మిస్తూ విదేశాల్లోని చైనా ఆధారిత సైబర్ స్కామ్ కంపెనీల్లో నేరాలు చేయించడానికి తరలిస్తున్నారు. అలా వచ్చిన యువతీయువకులతో చైనాకు చెందిన పలు స్కామ్ కంపెనీలు ఫేక్ ప్రొఫైల్ సృష్టించి సోషల్‌మీడియాలో టార్గెటెడ్ వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. నమ్మిన వారి నుంచి పెట్టుబడులు, టాస్క్ గేమ్స్, డిజిటల్ అరెస్ట్, హనీట్రాప్, ఫిషింగ్ లింక్స్ పద్ధతుల్లో డబ్బులు కాజేస్తారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వెళ్తున్నారు. ఈ ఘటనల్లో 9 కేసుల్లో 22 మందిని అరెస్టు చేశాం.
ఈనెల 14న కాంబోడియాకు నలుగురు యువతీయువకులను డేటా ఎంట్రీ జాబ్ పేరుతో పంపించడానికి ప్రయత్నించిన గాజువాకకి చెందిన ఏజెంట్ సురేశ్, ఆదిలక్ష్మి అలియాస్ అనుని విశాఖపట్నం (Visakhapatnam) ఎయిర్‌పోర్టు వద్ద అరెస్ట్ చేశాం. సురేశ్ ఇదివరకే కాంబోడియాకు వెళ్లి అక్కడ చైనా స్కామ్ కంపెనీలో పనిచేశాడు. అక్కడ విజయ్‌కుమార్ అలియాస్ సన్నీతో పరిచయం పెంచుకొని ఇటీవల భారత్‌కు వచ్చి.. కాంబోడియాలోని సైబర్‌స్కామ్ కంపెనీకి ఏజెంట్‌గా మారాడు. ఇప్పటి వరకు 12 మందిని పంపించినట్లు విచారణలో తేలింది. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.50వేలు, 2వేల యూఎస్ డాలర్లు, 20 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం. కాంబోడియా, మయన్మార్‌కు వెళ్లి చిక్కుకున్న 85 మందిని విశాఖకు రప్పించాం. మిగతా బాధితులను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర నుంచి విజిటింగ్ వీసాలపై కాంబోడియా, మయన్మార్ వెళ్లిన వారు దాదాపు 500 మంది ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రిక్రూట్మెంట్ ఏజెంట్లు/కన్సల్టెన్సీల పేరుతో ప్రజలను మోసగిస్తే ఇమ్మిగ్రేషన్ యాక్ట్-1983 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అనధికారిక ఏజెంట్లను నమ్మి ప్రజలు మోసపోవద్దు. యువత, వారి తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రిజిస్టర్డ్ ఏజెంట్లనే సంప్రదించాలి. విదేశీ ఉద్యోగాల పేరుతో ఎవరైనా అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినా, అనుమానం వచ్చినా విశాఖ సీపీ ప్రత్యేక నంబర్ 7995095799కు లేదా 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి’’అని సీపీ తెలిపారు.
Also Read : CM Chandrababu Naidu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ
