Bihar: బిహార్ లో ఐసీయూలో కాల్పుల కలకలం ! పేషెంట్ పై కాల్పులు జరిపి హత్య !
బిహార్ లో ఐసీయూలో కాల్పుల కలకలం ! పేషెంట్ పై కాల్పులు జరిపి హత్య !
Bihar : బిహార్ లో పాట్నాలోని రాజాబజార్ పారస్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గ్యాంగ్ వార్ లో భాగంగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో పట్నాలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు తుపాకీలతో కాల్పులు జరిపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ కాల్పుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల పెరోల్‌పై విడుదలైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా హత్యకు గురైనట్టు పోలీసులు తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Bihar Gang War
బక్సర్ జిల్లాకు చెందిన పలు హత్యకేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న చందన్ మిశ్రా.. ప్రస్తుతం పేరోల్ మీద బయటకు వచ్చాడు. అనారోగ్యం కారణంగా పారస్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే చందన్ మిశ్రాకు చెందిన ప్రత్యర్ధులు… తుపాకీలతో ఆసుపత్రిలో చొరబడ్డారు. సినీ ఫక్కీలో ఐసీయూలోనికి వెళ్ళి అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చందన్ మిశ్రా అక్కడికక్కడే మృతి చెందాడు. ‘సీసీటీవీ ఫుటేజీలో ఐసీయూలోకి చొరబడి కాల్పులు జరిపిన దృశ్యాల ఆధారంగా చందన్ మిశ్రాను ప్రతీకారం తీర్చుకునేందుకే చందన్ షేరు గ్యాంగ్ ప్రాణాలు తీసినట్లు పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాము’ అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తికేయ శర్మ తెలిపారు.
ఇటీవల బిహార్‌లో (Bihar) పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వ్యాపారి గోపాల్ ఖేమ్కా, బీజేపీ నేత సురేంద్ర కెవత్, లాయర్ జితేంద్ర మహాతో హత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో పట్నా ఆసుపత్రి హత్య తీవ్ర కలకలానికి దారి తీసింది. దీనితో రాష్ట్రంలో నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీఎం నితీష్ కుమార్ నివాసానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. పరాస్ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఆర్జేడీ, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ (Bihar) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రభుత్వ అడంతో నేరస్తులే ఆస్పత్రి ఐసీయూలోకి చొరబడి రోగిని కాల్చి చంపారు.బీహార్‌లో (Bihar) ఎక్కడైనా ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 2005 కి ముందు ఇది జరిగిందా? అని నితిష్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అయితే ఈ దారుణానికి పాల్పడిన క్రిమినల్స్‌ను వదిలిపెట్టేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా భరోసా ఇచ్చారు. లోతైన దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో హింసాత్మక ఘటన నియంత్రణకు అనేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ మీడియాకు తెలిపారు. 2004కు పూర్వంతో పోలిస్తే ప్రస్తుతం నేరాల సంఖ్య తగ్గిందని తెలిపారు. తాజా ఘటనలో నిందితులు ఆసుపత్రిలోకి ప్రవేశించి ఐసీయూ వరకూ ఎలా వచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మరోవైపు, పట్టపగలే నిందితులు ఆస్పత్రి ఐసీయూలోకి ప్రవేశించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన్ మిశ్రా హత్య వెనుక ఆస్పత్రి వర్గాల ప్రమేయో కూడా ఉండొచన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇందులో భాగంగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు, యాజమాన్యాన్ని సైతం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని ఆచూకీ గుర్తించేందుకు పాట్నా పోలీసులు.. బక్సర్ పోలీసుల సహకారంతో షూటర్ల ఫోటోలు సేకరించి వారి గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, ఈ ఏడాది నవంబర్‌లో బీహార్‌లో (Bihar) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సీఎం నితిష్ కుమార్ ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే, బీహార్‌లో వరుస హత్యలతో శాంతి భద్రతలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.
Also Read : Robert Vadra: రాబర్ట్ వాద్రాపై ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
