AK-203 Rifle: భారత్‌ కా షేర్ ‘ఏకే 203’ ! నిమిషానికి 700 బుల్లెట్లు ఫైర్‌ !

భారత్‌ కా షేర్ ‘ఏకే 203’ ! నిమిషానికి 700 బుల్లెట్లు ఫైర్‌ !

AK-203 : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దాయాది పాకిస్థాన్ ఒకవైపు, సరిహద్దుల వద్ద ఏదోఒకరకంగా చికాకుపెట్టే డ్రాగన్ చైనా ఇంకోవైపు.. ఇలాంటి తరుణంలో భారత సైన్యం తన ఆయుధశక్తిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కలాష్నికోవ్‌ సిరీస్‌ లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లు అనుకున్న సమయానికంటే ముందే ఆర్మీకి అందనున్నాయి. నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల సామర్థ్యం ఈ రైఫిల్‌ సొంతం. అలాగే ఇది 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది.

AK-203 Rifle Updates

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అమేఠీలో భారత్‌-రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‘షేర్’ పేరుతో ఏకే-203 రైఫిళ్లను (AK-203) తయారుచేస్తోంది. వాస్తవానికి రూ.5,200 కోట్ల కాంట్రాక్టులో భాగంగా 2032 అక్టోబరు నాటికి 6,01,427 ఏకే 203 రైఫిళ్లను అందజేయాల్సి ఉంది. కానీ, అనుకున్న సమయానికి 22 నెలల ముందు అంటే 2030 నాటికే వీటిని భద్రతా దళాలకు ఇచ్చేస్తామని ఐఆర్‌ఆర్‌పీఎల్‌ సీఈఓ-మేనేజింగ్‌ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ ఎస్‌.కె.శర్మ తాజాగా వెల్లడించారు. ‘‘ఇప్పటికే దాదాపు 48 వేల రైఫిళ్లను ఇచ్చేశాం. రెండు నుంచి మూడు వారాల్లోగా మరో 7 వేల రైఫిళ్లు అందజేస్తాం. డిసెంబరు నాటికి 15 వేల రైఫిళ్లు అదనంగా ఇస్తాం’’ అని ఆయన వెల్లడించారు.

ఏకే-47, ఏకే-57తో పోల్చుకుంటే ఈ ‘షేర్’ తుపాకీలు అత్యాధునికమైనవి. కలాష్నికోవ్‌ సిరీస్‌లో ప్రమాదకరమైనవి కూడా. కొన్ని దశాబ్దాలుగా సాయుధ దళాలు ప్రముఖంగా వినియోగించే ఇన్సాస్‌ రైఫిళ్ల స్థానంలో ఆర్మీ వీటి వినియోగం పెంచనుంది. ఇన్సాస్‌ రైఫిల్ కాలిబర్‌ 5.62 ఎంఎం కాగా..7.62 ఎంఎం కాలిబర్‌తో వీటిని రూపకల్పన చేశారు. ఇక ఈ తుపాకీ బరువు 3.8 కేజీలు కాగా.. ఇన్సాస్ 4.15 కేజీల బరువుంటుంది. పొడవు కూడా తక్కువే. షేర్ పొడవు 705ఎంఎంగా ఉంది. సరిహద్దుల్లో మరీ ముఖ్యంగా నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి పహారా కాస్తున్న మన సైనికుల చేతికి ఇవి అందితే.. మన బలగాల పోరాట సామర్థ్యం బలోపేతం కానుందని రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Also Read : CM Siddaramaiah: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు – కర్ణాటక సీఎం బంపర్ ఆఫర్

Leave A Reply

Your Email Id will not be published!