CM Himanta Biswa Sarma: రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు

Himanta Biswa Sarma : అవినీతి కేసుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జైలుకి వెళ్తారని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం హిమంత స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యల కారణంగా తమ రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసుల పైనే దాడి చేశారని ఆరోపించారు.

CM Himanta Biswa Sarma Key Comments

అటవీ భూమిలో ప్రజలు స్థిరపడలేరని రాహుల్‌ గ్రహించలేకపోతున్నారని హిమంత (Himanta Biswa Sarma) విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కానీ, కబ్జాదారులకు అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఆరోపించారు. ఈ రకమైన ప్రసంగాల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయారన్నారు. వారు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలో రాహుల్‌ చేసిన ప్రసంగాలను పోలీసులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ప్రసంగాలతో హింసను ప్రేరేపించినట్లు విచారణలో తేలితే రాహుల్‌ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటికే వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాకు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసందర్భంగా ‘గాంధీల’ కోసం చాలా జైళ్లు ఎదురుచూస్తున్నాయని హిమంత కౌంటర్‌ ఇచ్చారు.

గోల్పారా జిల్లా కమిషనర్‌ ప్రొదీప్‌ టిముంగ్‌ మాట్లాడుతూ… అటవీ గార్డులు, పోలీసు సిబ్బందిపై ఆక్రమణదారులు కర్రలతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘర్షణల్లో 21 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో ఒక ఆక్రమణదారుడు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయని వివరించారు. ఇటీవల రాహుల్‌ అస్సాంలో పర్యటించారు. చయ్‌గావ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. హిమంత (Himanta Biswa Sarma) తనను తాను రాజుగా భావిస్తున్నారని విమర్శించారు. కానీ, అవినీతి కేసుల్లో ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కాకుండా.. ప్రజలే ఆయన్ను కారాగారానికి పంపిస్తారన్నారు.

10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం మా బావను వెంటాడుతోంది – రాహుల్‌ గాంధీ

గత పదేళ్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం తన బావను (రాబర్ట్‌ వాద్రాను ఉద్దేశిస్తూ) వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన కేసులో రాబర్ట్‌ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే శుక్రవారం రాహుల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

గత పదేళ్లుగా ఈ ప్రభుత్వం తన బావను వెంటాడుతూనే ఉందని రాహుల్‌ మండిపడ్డారు. ఈ తాజా ఛార్జిషీటు కూడా ఆ కోవకు చెందినదేనని విమర్శించారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్‌ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని రాహుల్‌ (Rahul Gandhi) హామీ ఇచ్చారు. ఈసందర్భంగా వీటిని తట్టుకునే ధైర్యం వారందరికీ ఉందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు.

హరియాణాలోని శికోహ్‌పుర్‌లో భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు రాబర్ట్‌ వాద్రాపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీ ఇప్పటికే పలుమార్లు ఆయనను విచారించింది. ఈ క్రమంలో గురువారం ఆయనపై అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. వాద్రా సంస్థ స్కైలైట్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆయనతో సంబంధం ఉన్న సత్యానంద్‌ యాజీ, కేవల్‌ సింగ్‌లను, వారి సంస్థ ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ సహా మొత్తం 11 సంస్థల పేర్లను ఛార్జిషీట్‌లో ఈడీ చేర్చింది. వాద్రాకు చెందిన రూ.37.64 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను దర్యాప్తు సంస్థ జప్తు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇక, ఈడీ ప్రకారం… వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో శికోహ్‌పుర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లుగా పేర్కొంది. నాలుగేళ్ల తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అయిన డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ లావాదేవీలపై మనీలాండరింగ్‌ ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో 2018లో వాద్రా పేరును ఈడీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఆయనతో పాటు నాటి హరియాణా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌, ఓ ప్రాపర్టీ డీలర్‌ పేరును ప్రస్తావించింది.

Also Read : Bhupesh Baghel: మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కుమారుడి అరెస్టు

Leave A Reply

Your Email Id will not be published!