Anand Mahindra: లోకేశ్ పోస్ట్ కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశక్తికరమైన రిప్లై
లోకేశ్ పోస్ట్ కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశక్తికరమైన రిప్లై
Anand Mahindra : ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్- మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మధ్య ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ట్వీట్స్ కు… మంచి ఆదరణ ఉంటుంది. అయితే, ఈ సారి ఆనంద్ మహీంద్రా తన సందేశాన్ని తెలుగులో రాశారు. ‘ఒక్క నిర్ణయం చాలు… మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి.’ అని రాసి సదరు కొత్త తరహా ట్రక్ గురించిన వీడియో పెట్టారు.
IT Minister Nara Lokesh , Anand Mahindra Discussion
అయితే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పెట్టిన పోస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘తెలుగు ప్రకటన చాలా బావుంది. మీ వాహనాలకు ఏపీలో మంచి ఆదరణ ఉంది. అంతేకాదు, అధునాతన ఆటోమోటివ్ వ్యవస్థ పర్యావరణాన్ని కాపాడటానికి, పెద్ద మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మహీంద్రా తయారీ కేంద్రాన్ని ఏపీలో పెట్టాలని, మీ టీంకు ఆతిథ్యం ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్న పుష్కలమైన అవకాశాలను అందిపుచ్చుకోడానికి పూర్తి సహకారం అందిస్తాం’ అని నారా లోకేష్ రీట్వీట్ చేశారు.
దీనితో లోకేష్ ట్వీట్ మీద ఆనంద్ మహీంద్రా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వాములమైతే ఎంతో గర్విస్తాం. సోలార్ ఎనర్జీ, సూక్ష్మ నీటిపారుదలతో పాటు టూరిజం వంటి వివిధ రంగాలకు సంబంధించి మా బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది… మున్ముందు ఏం జరగనుందో చూద్దాం’ అని ఆనంద్ మహీంద్రా సమాధానమిచ్చారు. దీనితో ఇద్దరి పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Also Read : CM Revanth Reddy: కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదు సీఎం రేవంత్ రెడ్డి
