Bogatha Water Falls: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం ! సందర్శనకు అనుమతి నిరాకరణ !
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం ! సందర్శనకు అనుమతి నిరాకరణ !
Bogatha Water Falls : ములుగు జిల్లాలోని వాజేడులో కుండపోత వర్షాలతో బొగత జలపాతం (Bogatha Water Falls) పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో పర్యటకుల భద్రత దృష్ట్యా ఈ జలపాతాన్ని తాత్కాలికంగా అనుమతి నిలిపివేయాలని తెలంగాణ అటవీశాఖ నిర్ణయించింది. ఈ నెల 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ జలపాతం వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు.. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. సందర్శకులను అనుమతించడంలేదు.
Bogatha Water Falls Blocked
మరోవైపు, ముత్యందార, కొంగల, మామిడిలొద్ది, కృష్ణాపురం జలపాతాలను సైతం శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యటకులను ఆయా జలపాతాల వద్దకు అనుమతించబోమని తెలిపారు. ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, పోలీసు కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష హెచ్చరిక
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత భారీ వర్ష హెచ్చరిక చేసింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే వీలుందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
Also Read : CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి – సీఎం రేవంత్రెడ్డి
