Murder : తల్లిదండ్రులు వద్దన్న వ్యక్తితో మాట్లాడుతోందని అక్కను హత మార్చిన (Murder) తమ్ముడిని రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన దేశాల రాఘవేందర్ కు రుచిత, రోహిత్ సంతానం. రుచిత డిగ్రీ పూర్తి చేసే ఇంటి వద్ద ఉండగా కుమారుడు రోహిత్ ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రుచిత, అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి దినేశ్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో పంచాయితీ పెట్టి దినేశ్‌ను మందలించారు.
సోమవారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా… ఇంట్లో రుచిత, ఆమె సోదరుడు రోహిత్ మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో దినేశ్‌తో రుచిత మాట్లాడటాన్ని గమనించిన రోహిత్… సోదరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గొడవకు దిగి ఆమె గొంతుకు వైరు బిగించి హత్య (Murder) చేశాడు. కుమారుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి రాఘవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం కొత్తూరు టౌన్‌లోని పెంజర్ల క్రాస్ రోడ్డు వద్ద రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. దినేశ్‌తో అక్క తరచూ ఫోన్లో మాట్లాడుతోందనే హత్య (Murder) చేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.
Murder – అత్తను నరికి చంపిన అల్లుడు !
అల్లుడు వేట కొడవలితో అత్తను నరికి చంపిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ముర్మాముల గ్రామ శివారు బంజెరలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ (55)కు భర్త యాదగిరి, కుమార్తె భవాని ఉన్నారు. భవానిని ఎనిమిదేళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వజ్రమ్మ, భర్త యాదగిరి, కుమార్తె భవాని, అల్లుడు మహేశ్‌తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని బోయిన్పల్లి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో వజ్రమ్మ, కూతురు, అల్లుడి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు ఈనెల 22న స్వగ్రామమైన బంజెరకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. 26న భవానిని ధర్మారంలోని ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేశ్ తన తమ్ముడైన హరీశ్‌ను వెంటబెట్టుకుని బైక్‌పై మధ్యాహ్నం బంజెరకు వెళ్లారు.
గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేశ్, హరీశ్ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సీఐ కొండ శ్రీను, ఎస్సై షేక్ మహబూబ్, నవీన్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Also Read : CM Revanth Reddy: పాత బస్తీ మెట్రో పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
