Sadhvi Pragya Thakur: మాలేగావ్ పేలుళ్లు కాంగ్రెస్ కుట్ర – మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
మాలేగావ్ పేలుళ్లు కాంగ్రెస్ కుట్ర - మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
Sadhvi Pragya Thakur : మాలేగావ్ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ (Sadhvi Pragya Thakur) ఆదివారం భోపాల్ చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… 2008 మాలేగావ్ పేలుళ్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రగా అభివర్ణించారు. పార్టీ ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, ఈ కేసులో బీజేపీను ఇరికించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఈ కేసును దేశద్రోహం కింద విచారించాలని డిమాండ్ చేశారు. ఆనాటి పేలుళ్లకు బీజేపీను కారణంగా చూపాలని ప్రయత్నాలు చేసిన వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని అన్నారు. కాంగ్రెస్‌వి మతతత్వ రాజకీయాలని… ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికించి.. జైళ్లలో హింసించేవారని ఆరోపించారు.
Sadhvi Pragya Thakur Shocking Comments
మాలేగావ్ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన అనంతరం శనివారం ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడుతూ… కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. అయితే అవన్నీ అబద్ధాలు కావడంతో తాను ఏమీ చెప్పలేదన్నారు.
2008 సెప్టెంబరు 29న మహారాష్ట్ర లోని మాలేగావ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటార్ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్, ప్రసాద్ పురోహిత్‌తో పాటు రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్‌కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదైంది. తగిన ఆధారాలు లేకపోవడంతో మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని ముంబయిలోని ప్రత్యేక కోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది.
Also Read : Minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు
