Fake Doctor: ఆపరేషన్ చేస్తుండగా నకిలీ వైద్యుడి అరెస్ట్
ఆపరేషన్ చేస్తుండగా నకిలీ వైద్యుడి అరెస్ట్
Fake Doctor : ‘వైద్యో నారాయణో హరి’ అంటూ డాక్టర్ని దేవుడితో పోలుస్తారు. అలాంటి వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడో నకిలీ డాక్టర్. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో చిరంజీవి స్టైల్లో డాక్టర్ అవతారమెత్తాడు. ఆ సినిమాలో చిరంజీవి మందులతోనే రోగాన్ని నయం చేయకుండా… మానవత్వం, ప్రేమతో వారికి చికిత్స చేస్తాడు. కానీ, ఈ డాక్టర్ మాత్రం మిడిమిడి జ్ఞానంతో 50కి పైగా సర్జరీలు చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. అసలు విషయం బయటపడటంతో అతడిని అస్సాంలోని సిల్చార్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
Fake Doctor Arrest
అస్సాంలోని శ్రీభూమి ప్రాంతానికి చెందిన పులోక్ మలాకర్ ఎంబీబీఎస్ చేయకుండానే నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి డాక్టర్ (Fake Doctor) అవతారమెత్తాడు. గత కొంత కాలంగా సిల్చార్‌లోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో గైనకాలజిస్టుగా పని చేస్తూ… 50కి పైగా సర్జరీలు చేశాడు. అయితే, అతడి వైద్య విధానం, రోగులతో అతడు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు… అతడి సర్టిఫికెట్లన్నీ నకిలీవిగా గుర్తించారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో… దొంగ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడని, గత పదేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని నిర్ధరించారు.
మలాకర్ సిల్చార్‌లోని ఆస్పత్రిలో సర్జరీ చేస్తుండగా… పక్కా ప్రణాళిక ప్రకారం అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలో నకిలీ డాక్టర్ల అరాచకాలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నకిలీ వైద్యులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులతో కలిసి ఈ బృందం పని చేస్తోంది.
Also Read : Guvvala Bala Raju: బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా
