Satyapal Malik: మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

Satyapal Malik : జమ్మూకశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన సత్యపాల్‌ మాలిక్‌ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన… దిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. మాలిక్‌ ఆగస్టు 23, 2018 నుంచి అక్టోబరు 30, 2019 వరకు జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన పదవీకాలంలోనే… ఆర్టికల్‌ 370 రద్దుచేశారు. జమ్మూకశ్మీర్‌ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. రెండు ప్రాజెక్టులకు సంబంధించి కొందరు తనకు లంచం ఇవ్వాలని చూశారని ఆయన గతంలో ఆరోపించారు. పుల్వామా ఉగ్రదాడి సంబంధించిన పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.

Satyapal Malik – సత్యపాల్‌ మాలిక్‌ రాజకీయ ప్రస్థానం ఏమిటంటే ?

సామాజికవేత్త డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా భావజాలం నుంచి ప్రేరణ పొందిన సత్యపాల్ మాలిక్‌ (Satyapal Malik) 1965-66లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1974లో శాసనసభలోకి అడుగుపెట్టారు. 1975లో నూతనంగా ఏర్పడిన లోక్‌దళ్‌కు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1984లో కాంగ్రెస్‌లో చేరిన మాలిక్‌ 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. బోఫోర్స్‌ కుంభకోణంతో నిరాశ చెందిన ఆయన 1987లో కాంగ్రెస్‌కు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం ఆయన ‘జన్‌ మోర్చా’ను స్థాపించి 1988లో దాన్ని జనతాదళ్‌లో విలీనం చేశారు.

2004లో బీజేపీలో చేరిన మాలిక్‌… బాగ్‌పత్‌ నుంచి పోటీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు పార్టీ వ్యవసాయ మ్యానిఫెస్టోను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మాలిక్‌ సేవలను గుర్తించిన కేంద్రం ఆయనను 2017లో బిహార్‌ గవర్నర్‌గా నియమించింది. జమ్మూకశ్మీర్, గోవా, మేఘాలయ, ఒడిశాలకు కూడా గవర్నర్‌గా, ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, లోక్‌సభ, పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు.

Also Read : Pakistani Sister: ప్రధాని మోదీకి పాక్‌ ముస్లిం సోదరి స్పెషల్‌ రాఖీ

Leave A Reply

Your Email Id will not be published!