YSRCP Leaders: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలి – వైసీపీ
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలి - వైసీపీ
YSRCP : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం, నిబంధనలకు విరుద్దంగా పోలింగ్ కేంద్రాల మార్పు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీస్ యంత్రాంగం తదితర అంశాలపై విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి వైయస్ఆర్‌సీపీ (YSRCP) ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ వెంటనే ఈ అంశాలపై విచారణ జరిపి, తప్పు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పులివెందులలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. అనంతరం వైయస్ఆర్‌సీపీ (YSRCP) తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
YSRCP – ఓటమి భయంతోనే టీడీపీ అరాచకం – వైసీపీ నేతలు
ఈ సందర్భంగా వైసీపీ (YSRCP) నేతలు మాట్లాడుతూ… దేశం మొత్తం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణపై ఆసక్తితో చూస్తున్నారు. పులివెందులలో అధికార తెలుగుదేశం పార్టీ, వారికి అండగా నిలిచిన పోలీస్ యంత్రాంగం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం 10,600 ఓట్లు పోలయ్యే ఒక చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి దొడ్డిదోవన గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ బహిరంగంగా అన్ని విలువలను వదిలేసి, మొత్తం అధికార యంత్రాంగాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని, మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, శాయశక్తులా ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవాలని చేస్తున్న దుశ్చర్యలు బహుశా దేశంలోనే ఎక్కడా ఎవరూ చూసి ఉండరు.
వైయస్ఆర్‌సీపీ నాయకులను తప్పుడు కేసుల్లో పెట్టి, ఎన్నికల ప్రచారానికి వెళ్ళనివ్వకుండా బైండోవర్ అంటూ స్టేషన్ల లోనే రోజంతా నిర్బంధించడం చేస్తున్నారు. ఆఖరికి వైయస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మరో నాయకుడు వేల్పుల రాములపై మారణాయుధాలతో దాడులు చేయడం, వారి వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు తెగబడటం చూస్తుంటే ఈ ఎన్నికపై అధికార తెలుగుదేశం ఎంతగా భయపడుతుందో అర్థమవుతోంది.
అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన పద్నాలుగు నెలల పాలనను చూపి ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే సాహసం చేయలేకపోతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఛీ కొడతారనే భయంతోనే ఉన్మాదంతో తన పార్టీ కార్యకర్తలను, రౌడీమూకలను ప్రతిపక్ష పార్టీ పైకి ఉసికొల్పుతోంది. ఎన్నికల నామినేషన్ వేసినప్పటి నుంచి పులివెందుల్లో వారు సృష్టిస్తున్న అరాచకంపై ప్రతిరోజూ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అప్రజాస్వామిక విధానాలపై రెండు రోజులుగా ఎన్నికల కమిషనర్‌ను కలిసి వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే, వారు అందుబాటులో లేరు.
ఆదివారం ఎస్‌ఈసీ కార్యాలయంలో ఉన్నారని తెలిసి, న్యాయవాదులతో కలిసి వెళ్ళి వారిని కలవడం జరిగింది. నిత్యం టీడీపీ (TDP) దాడులు, అరాచకం, పోలీస్ యంత్రాంగం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై మేం అందిస్తున్న వినతిపత్రాలను, ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ అధికారులు తీసుకుని, కింది వారికి పంపుతున్నారే తప్ప వాటికి సంబంధించిన చర్యలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకువచ్చాం. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన వ్యవస్థ, స్వర్గీయ టీఎన్ శేషన్ వంటి మహనీయులు ఈ వ్యవస్థకు గోప్ప కీర్తిని తీసుకువచ్చారు. అటువంటి వ్యవస్థకు అధిపతిగా ఉండి, ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడేలా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కోరాం. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని విజ్ఞప్తి చేశాము.
ప్రజాప్రాతినిధ్యం చట్టాన్ని కూటమి నేతలు ఉల్లంఘించారు – వైసీపీ
పులివెందుల్లో పోలీస్ అధికారులు పెడుతున్న అక్రమ కేసులు, టీడీపీ (TDP) నాయకులు కడపజిల్లా లోని అనేక నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పులివెందుల్లో మోహరింపచేశారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా టీడీపీ (TDP) నాయకులను పులివెందులకు తీసుకువస్తున్నారు. వారిని నిలువరించాలని కోరాం. పోలింగ్ బూత్‌లను 1951 ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 25 ప్రకారం ఓట్లర్ల చేర్పులు, తీసివేతలు, పోలింగ్ కేంద్రాల మార్పులకు ముందుగా నోటిఫికేష్ ఇవ్వాలి. ఓటర్ల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలి, గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ తరువాతే మార్పులకు అవకాశం ఉంటుంది. కానీ పులివెందుల్లో మాత్రం ఇటువంటి నిబంధనలను పాటించకుండానే పోలింగ్ కేంద్రాలను మార్చారని గుర్తు చేశాం. దీనిని సమర్థించుకుంటూ ఒకే గ్రామపంచాయతీ పరిధిలో శివారు గ్రామాలకు పోలింగ్ కేంద్రాలను మార్చామని చెబుతున్నారు.
పంచాయతీ కేంద్రంలో ఉన్న పోలింగ్ కేంద్రం నుంచి ఈ శివారు గ్రామాలకు రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంకు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్లు స్వేచ్ఛగా అంతదూరం వెళ్ళి ఓటు వేసే అవకాశం ఉంటుందా? దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటీ? ఒక పథకం ప్రకారం తెలుగుదేశం నాయకులు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏదో ఒకరకంగా గెలవాలనే కుట్రతోనే ఈ పోలింగ్ కేంద్రాల మార్పు చేయించారు. రాష్ట్రంలో అనేక జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం పులివెందుల్లో మాత్రమే ఉప ఎన్నిక పెట్టడం వెనుకే కుట్ర ఉంది. తప్పులు చేసిన అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ స్పందించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలు చిత్తశుద్దితో పనిచేయకపోతే అరాచకం మాత్రమే మిగులుతుంది. కమిషనర్ కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా చెప్పడం జరిగింది.
Also Read : Pulivendula ZPTC: ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ! జోరందుకున్న తెరవెనుక రాజకీయం !
