India: ట్రంప్‌- పుతిన్‌ భేటీపై స్పందించిన భారత్‌

ట్రంప్‌- పుతిన్‌ భేటీపై స్పందించిన భారత్‌

India : ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా అలాస్కా వేదికగా అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్‌ స్వాగతించింది. ఈ భేటీలో భాగంగా సాధించిన పురోగతిని అభినందిస్తున్నట్లు పేర్కొంది. భారత విదేశాంగశాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

India Responds on Trump – Putin Meeting

‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత పుతిన్‌ ల మధ్య అలాస్కాలో జరిగిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. శాంతి సాధన దిశగా వారి ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఈ భేటీలో సాధించిన పురోగతిని అభినందిస్తున్నాం. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాలి. ఉక్రెయిన్‌ సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరపడాలని ప్రపంచం కోరుకుంటోంది’’ అని విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది.

ట్రంప్, పుతిన్‌లు (Putin) భేటీ అయ్యేందుకు ముందుకు రావడాన్ని కూడా భారత్‌ ఇటీవల స్వాగతించిన విషయం తెలిసిందే. ‘‘ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాం. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ సందేశానికి ఈ ప్రయత్నాలు దోహదం చేస్తాయి’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్‌ చివరలో ట్విస్ట్‌ ఇచ్చారు.

కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ… సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.

మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తానని ట్రంప్‌ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్‌-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్‌.

Also Read : IndiGo: ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

Leave A Reply

Your Email Id will not be published!