Tejashwi Yadav: రాహుల్‌ ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం – తేజస్వీ యాదవ్‌

రాహుల్‌ ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం - తేజస్వీ యాదవ్‌

Tejashwi Yadav : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు. బిహార్‌ లో ఓటరు జాబితా సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ… రాహుల్‌ గాంధీ ‘ఓటర్‌ అధికార యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం నవాడాలో జరిగిన ఈ యాత్రలో తేజస్వీ (Tejashwi Yadav) పాల్గొని మాట్లాడారు. కాగా ‘ఇండియా’ కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై అప్పట్లో కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే అయితే మద్దతు ఇవ్వగలమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

Tejashwi Yadav Challenge

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను (Rahul Gandhi) ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కృషి చేస్తాయన్నారు. తేజస్వీ వ్యాఖ్యల సమయంలో రాహుల్‌ కూడా పక్కనే ఉన్నారు. ఇక, దీనికి ముందు తేజస్వీ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ… ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన వాస్తవాలతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌ను ఆయన చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. ప్రాణాలతో ఉన్నవారిని చనిపోయినట్లు ఎందుకు పేర్కొంటున్నారో తమకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఆయన బీజేపీలో సభ్యత్వం తీసుకొని ఉంటే చెప్పాలంటూ విమర్శలు చేశారు. ఓటర్‌ అధికార యాత్రకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. దీంతో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి.. భాజపా ఓట్లను ఎలా దొంగిలిస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.

బిహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఓట్ల చోరీపై ప్రతిపక్షాలు కొంతకాలంగా పెద్దఎత్తున ఆందోళన వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల విషయంలో బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతుందని రాహుల్‌ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన బిహార్‌లో ‘ఓటర్‌ అధికార యాత్ర’ చేస్తున్నారు. విపక్షాల ఆరోపణలపై ఇటీవల జ్ఞానేశ్ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ ఆరోపణలపై తగిన ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకం చేసి తమకు సమర్పించాలని ఈసీ అల్టిమేటం జారీ చేసింది.

Tejashwi Yadav – బీహార్ ప్రజలను ఫూల్స్ చేసేందుకు

నవడా ర్యాలీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ… ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్, బీజేపీ చేతులు కలిపాయని, బిహార్ ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఓటు హక్కును చోరీ చేయాలని బీజేపీ అనుకుంటోందని, ఎస్ఐఆర్ అనేది ఓట్ల దోపిడీ అని, ఇదెంతమాత్రం సాగనీయమని అన్నారు. బిహార్‌లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా కుట్ర జరుగుతోందని చెప్పారు. నితీష్ కుమార్ సారథ్యంలోని ‘పాతబడిన, చిరిగిపోయిన’ ప్రభుత్వాన్ని యువత ఇంటికి సాగనంపాలని కోరారు. చినిగిపోయిన వస్తువులను కొత్తవాటితో భర్తీ చేసినట్టే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు యువత పట్టుదలగా ఉందని చెప్పారు.

Also Read : Gaming Bill: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం

Leave A Reply

Your Email Id will not be published!