HYDRAA: మాదాపూర్ లో రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా !
మాదాపూర్ లో రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా !
HYDRAA : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 22.20 ఎకరాల్లో సుమారు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లేఔట్లో 4 పార్కులుండగా 2 కబ్జా(దాదాపు 8,500 గజాలు)కు గురయ్యాయి. అలాగే 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురైంది. వీటికి తోడు… 300ల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా (HYDRAA) తొలగించింది. ఇలా మొత్తం 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుంది. 1995లో అనుమతి పొందిన ఈ లేఔట్‌ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది.
HYDRAA Saved
ఈ లేఔట్ ప్రకారం జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లేఔట్ ప్రతినిధులు హైడ్రా (HYDRAA) ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధరించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు. వెనువెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు. పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కబ్జాకు పాల్పడ్డవారిపై పోలీసు కేసులు పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.
జైహింద్‌రెడ్డిపై ఫిర్యాదులు
హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెటల్ చార్మినార్‌కు ఎదురుగా సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. అనుమతి లేకుండా హోటల్ నిర్మించి అద్దెలను జైహింద్‌రెడ్డి పొందుతున్నాడని జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే స్థలంలో భారీ ప్రకటనల హోర్డింగ్ కూడా పెట్టి రెండింటి ద్వారా నెలకు రూ.4 లక్షల వరకూ ఆదాయం పొందుతున్నాడని తెలిపారు. ప్రభుత్వ స్థలంలో హోటల్‌ను నిర్మించి అద్దె వసూలు చేస్తున్న వైనంపై గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2006లో రెగ్యులరైజ్ అయిన లే ఔట్ అక్కడి ప్లాట్ యజమానులకు తెలియకుండా తర్వాత ఎలా రద్దవుతుందని వాపోయారు. యూఎల్సీ ల్యాండ్ అయితే ప్రభుత్వానికి చెందుతుందని.. మధ్యలో జైహింద్‌రెడ్డిది ఎలా అవుతుందని ఎన్క్లేవ్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆయనపై చాలావరకు ల్యాండ్ గ్రాబింగ్ కేసులున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో హైడ్రా గురువారం ఆక్రమణలను కూల్చివేసింది.
Also Read : Minister Ponnam Prabhakar: ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే – పొన్నం ప్రభాకర్
