DK Shivakumar: గాంధీ కుటుంబమే నాకు దైవం – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

గాంధీ కుటుంబమే నాకు దైవం - కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

DK Shivakumar : కర్ణాటకలో ఒకవైపు ‘సీఎం మార్పు’ అంశంపై ఊహాగానాలు వినిపిస్తుండగా… మరోపక్క ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రార్థనా గీతాన్ని ఆలపించటం చర్చనీయాంశమౌతోంది. అయితే తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రార్థనా గీతాన్ని ఆలపించటంపై తాజాగా డీకే స్పందించారు. పార్టీలకు అతీతంగా తనకు ఎందరో మిత్రులు, అనుచరులు ఉన్నారని, అందరి మనోభావాలను గౌరవిస్తానని డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. తాను ఎవరికన్నా పెద్ద కాదని, కష్ట సమయంలో ఎవరున్నా వారికి అండగా నిలబడేందుకు తాను జీవితాంతం కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఆలాపనపై కాంగ్రెస్ నేతలు, విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల మనోభావాలను గాయపరిచి ఉంటే తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధమని అన్నారు.

DK Shivakumar Key Comments

‘‘బీజేపీను విమర్శించేందుకే నేను ఆ పాట పాడాను. కానీ కొందరు దీనిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడిఉంటే… అందుకు చింతిస్తున్నాను. నేను క్షమాపణలు చెప్తాను. అయితే అవి రాజకీయ ఒత్తిడివల్ల చెప్పే క్షమాపణలు కాదు’’ అని డీకే వెల్లడించారు. అలాగే గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని వ్యాఖ్యానించారు. ‘‘నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా… అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం. నేను వారి భక్తుడిని’’ అని స్పష్టం చేశారు.

డీకే శివకుమార్‌ ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమిత్‌ షాతో కలిసి సమావేశంలో పాల్గొనడం, కుంభమేళాలో పుణ్య స్నానం, ఇటీవల ప్రధాని మోదీతో దిల్లీలో భేటీ, యడియూరప్పతో తరచూ మంతనాలు, తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ గీతం పాడటం అధిష్ఠానానికి ప్రత్యేకంగా సంకేతాలు పంపడం కిందికే వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పుడు, తనపై పార్టీలో వ్యతిరేకత పెరిగినప్పుడు బీజేపీతో సఖ్యతగా ఉన్నట్లు సందేశాలు పంపుతుంటారు. తనకు బీజేపీ నుంచి మంచి అవకాశాలున్నాయన్నట్లు తమ పార్టీకి తెలియజేయటమే లక్ష్యమని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

DK Shivakumar – అసలేం జరిగిందంటే ?

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఆగస్టు 21న అసెంబ్లీలో జరిగిన చర్చలో డీకే పాల్గొంటూ, ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ‘నమస్తే సదా వత్సలే మాతృభుమే’లోని రెండు లైన్స్ ఆలపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించిన తొక్కిసలాట ఘటన వివరాలు తనవద్ద ఉన్నాయని చెబుతూ… ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. దీనిపై బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించరాదంటూ వారు నినదించారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ దీనిపై స్పందించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రార్థనా గీతం ఆలపించి ఉంటే… ఈ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్‌తో సహా అందరికీ చెందినది కాబట్టి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయన గీతం ఆలపించి ఉంటే ఆయన క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

Also Read : Minister Nadendla Manohar: స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

Leave A Reply

Your Email Id will not be published!