CM Siddaramaiah: కర్ణాటక సీఎం కారుకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
కర్ణాటక సీఎం కారుకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
CM Siddaramaiah : ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు ఊరట కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రయాణించే కారుపైనా చలానాలు ఉన్నాయి. 2024 నుంచి సిటీ జంక్షన్ల వద్ద పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కెమెరాలలో రికార్డయింది. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది. మరో కేసులో ఆయన వాహనం కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్స్‌ప్రెస్ కారిడార్ మీదుగా వేగంగా వెళ్తుండటం రికార్డయింది. గత జనవరి, ఫిబ్రవరి, ఆగస్టుల్లో కూడా సీట్‌బెల్ట్ ఉల్లంఘన కేసులు రికార్డయ్యాయి. దీనితో ఈ రాయితీని ఉపయోగించి ఆయన కూడా జరిమానాలు కట్టేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
CM Siddaramaiah Car Gets Fined
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రయాణించే కారుపై మొత్తం ఏడు ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఇందులో సీటు బెల్ట్ ధరించనందుకు ఆరుసార్లు, అతివేగానికి సంబంధించి ఒకసారి చలానా పడింది. సీఎం కారుకు జరిమానా ఉన్నా చెల్లించలేదని సామాజిక మాధ్యమాల్లో ఇటీవల తీవ్ర చర్చ నడిచింది. దీనితో సీఎం యంత్రాంగం డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగించుకుంది. ఈ చలానాలకుగానూ రాయితీ అనంతరం రూ.8750 చెల్లించింది. జరిమానా పడిన వాహనదారులు సగం కడితే… మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆగస్టు 21న ప్రారంభించిన ఈ స్కీమ్ సెప్టెంబరు 19వ వరకు అమల్లో ఉండనుంది. రాయితీ పథకంతో ఇప్పటివరకు రూ.40కోట్లు వసూలైనట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
Also Read : Badrinath Prasad: భారత్ సహా 140 దేశాలకు బద్రీనాథ్-కేదార్నాథ్ ప్రసాదం
