Anakapalli: రిమాండ్ ఖైదీల పరారీలో వెలుగులోనికి సంచలన విషయాలు
రిమాండ్ ఖైదీల పరారీలో వెలుగులోనికి సంచలన విషయాలు
Anakapalli : అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుండి పారిపోయిన ఇద్దరు రిమాండ్ ఖైదీలను విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పరారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ మేరకు అనకాపల్లి (Anakapalli) ఎస్పీ తుహిన్ సిన్హా … చోడవరం (Chodavaram) పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించి… కేసు వివరాలను వెల్లడించారు.
Anakapalli Prisoners
అనకాపల్లి (Anakapalli) ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం…. ఈ నెల 05వ తేదీన సాయంత్రం 4.00 గంటల సమయంలో, చోడవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్ననక్క రవి కుమార్ మరియు బేజవాడ రాము… హెడ్ వార్డర్ వాస వీర్రాజును ఇనుప సుత్తితో దాడి చేసి, గేటు తాళపు చెవులు లాక్కొని జైలు నుండి పారిపోయారు. ఈ క్రమంలో ASI కృష్ణమూర్తికు చెందిన మొబైల్ ఫోన్ను కూడా దొంగిలించారు. ఈ ఘటన అనంతరం అనకాపల్లి జిల్లా పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసారు. జిల్లా వ్యాప్తంగా తీవ్ర వాహన తనిఖీలు నిర్వహించారు.
అనకాపల్లి (Anakapalli) జిల్లా పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసుల ఆధారంగా, 6వ తేది సాయంత్రం 6.00 గంటల సమయంలో విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గొల్లలపాలెం జంక్షన్, SBI ప్రాంతం వద్ద ఇద్దరు పారిపోయిన నిందితులను పట్టుకొని, చోడవరం పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారంపై చోడవరం ఇన్స్పెక్టర్ పి.అప్పలరాజు, తన సిబ్బందితో కలిసి సిటీ టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుండి నిందితులను అదుపులోకి తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. మధ్యవర్తుల సమక్షంలో విచారణలో, నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించి, హెడ్ వార్డర్పై దాడి చేసిన విషయం, పారిపోవడానికి చేసిన ప్రణాళిక, మొబైల్ దొంగతనం విషయాలను ఒప్పుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసినది ఏమనగా… రవికుమార్, రాము ఇద్దరు కలిసి శారదా బారక్ లో ఉన్న సమయంలో సహ ఖైదీ ఏక స్వామితో సన్నిహితంగా మెలిగారు. అయితే వీరిద్దరికి బెయిల్ మంజూరైనప్పటికీ… జామీను దొరకకపోవడం వల్ల జైలులోనే ఉన్నారు. హెడ్ వార్డర్ వీర్రాజు రికార్డులు రాయడంలో, వంటగది పనుల్లో రవికుమార్ ను ఉపయోగించుకొని, తరచూ గేటు తాళం వేసుకోకుండా నిర్లక్ష్యం వహించేవాడు.
ఏక స్వామి గతంలో హత్యాయత్నం మరియు శారీరక దాడుల కేసుల్లో నిందితుడు మరియు అహంకార స్వభావం కలిగినవాడు కావడంతో ఎప్పుడూ వీరిద్దరిని జైలు నుండి పారిపోమని ప్రేరేపిస్తూ ఉండేవాడు. “మీకు ఎప్పటికీ జామీను దొరకదు, పది సంవత్సరాల శిక్ష తప్పదు” అంటూ తప్పించుకోవాలని సలహా ఇచ్చేవాడు. జైలు సిబ్బంది వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారని, వారిలో కేవలం ఒకరైన కానిస్టేబుల్ నానాజీ మాత్రమే అప్రమత్తంగా ఉంటాడని చెప్పి, నానాజీ డ్యూటీలో లేని సమయంలో తప్పించుకోవాలని ప్రణాళిక సూచించాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన వంటగదిలో ఇనుప సుత్తి దాచుకొని… హెడ్ వార్డర్ వీర్రాజుపై దాడి చేసి, ఇతర సిబ్బందిని గార్డు గదిలో బంధించి, ASI కృష్ణమూర్తి మొబైల్ ఫోన్ దొంగిలించి, గేటు తాళాలు లాక్కొని తప్పించుకున్నారు. వీరు కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, పి.ఎస్.పేట మార్గంగా వెళ్లి, చోడవరం నుండి విశాఖపట్నం వెళ్లే బస్సులో ఎక్కి, దొంగతనాలు చేసి మరింత దూరం పారిపోవాలని ప్రణాళిక వేశారు. ఇద్దరు నిందితులపైన సెక్షన్ 109(1), 331(5), 305(a), 262 r/w 3(5), 61, 49, 132, 121(1), BNS Act చోడవరం PS లో అధికారికంగా అరెస్టు చేసి… న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించాము.
Also Read : Minister Savitha: ప్రభుత్వ హాస్టల్స్ లో పే ఫోన్లు ప్రారంభించిన మంత్రి సవిత
