USA: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం ?

వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం ?

USA : ఏడు యుద్ధాలను ఆపినట్లు పదేపదే చెప్పుకొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఓ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కరేబియన్‌ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను మోహరించారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం చుట్టూ ఇవి సమయం కోసం ఎదురు చూస్తూ కాచుకు కూర్చొన్నాయి. దీంతో కరేబియన్‌ జలాలపై యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనుజువెలా లో చొరబడొచ్చని ప్రచారం జరుగుతోంది.

వెనుజువెలా ముఠాల నుంచి మాదకద్రవ్యాలు అమెరికాను (USA) ముంచెత్తుతున్నాయని ట్రంప్‌ మొదటి నుంచి చెబుతున్నారు. తాజాగా ఆ ముఠాలను అంతం చేసేందుకు సైనికదళాలను రంగంలోకి దింపారు. ఈ ముఠాలతో వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్‌ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.430 కోట్లు) బహుమతి ప్రకటించింది. ఇటీవలే మదురో సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని ట్రంప్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో హెచ్చరించారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడంలేదని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లెవెట్టి వెల్లడించారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్‌ (Trump) కార్యవర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది.

USA – ఎఫ్‌-35లు, గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్లు తో అమెరికా సిద్ధం !

కేవలం మాదకద్రవ్యాల ముఠాల కోసం యుద్ధం స్థాయిలో అమెరికా బలగాలను మోహరించింది. మొత్తం ఎనిమిది వార్‌షిప్‌లను అక్కడకు పంపింది. ది ఇవో జిమా యాంఫిబియస్‌ రెడీగ్రూప్‌లోని యూఎస్‌ఎస్‌ శాన్‌ ఆంటోనియో, యూఎస్‌ఎస్‌ ఇవో జిమా, యూఎస్‌ఎస్‌ ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ నౌకలు 4,500 మంది సైనికులతో కరేబియన్‌ సముద్రంలోకి వెళ్లాయి. 22వ మెరైన్‌ యూనిట్‌ కమాండోలు 2,200 మంది వీరిలో ఉన్నారు. ఏవీ-8బీ హారియర్‌ అటాక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్లైన యూఎస్‌ఎస్‌ జాన్సన్‌ డున్హమ్‌, యూఎస్‌ఎస్‌ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్‌లో మోహరించాయి. తూర్పు పసిఫిక్‌లో యూఎస్‌ఎస్‌ శాంప్సన్‌ త్వరలో వచ్చి చేరనుంది.

ఒక్కో డెస్ట్రాయర్‌లో 90 క్షిపణులు ఉంటాయి. గైడెడ్‌ మిసైల్‌ క్రూయిజర్‌ యూఎస్‌ఎస్‌ లేక్‌ ఎరి, మిన్నియాపోలీస్‌ సెయింట్‌ పాల్‌ కూడా వెనుజువెలాపై గురిపెట్టి ఉన్నాయి. శుక్రవారం రాత్రి 10 ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో పీ-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది. ఇటీవలే డ్రగ్స్‌ బోటు అంటూ ఓ పడవను అమెరికా దళాలు ముంచేశాయి. దీంతో 11 మంది మరణించారు. అమెరికా మోహరింపులను మదురో తప్పుపట్టారు. గత 100 ఏళ్లలో తమ దేశం ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా దానిని వర్ణించారు. 8 నౌకల్లో 1200 క్షిపణులను తమపై గురిపెట్టారని ఆరోపించారు.

USA – కేవలం డ్రగ్స్‌ కోసమేనా ? లేక చమురుపై ఆశా ?

వెనుజువెలా నుంచి మాదకద్రవ్యాల ముఠాలు పనిచేస్తున్నాయన్న ట్రంప్‌ (Trump) ఆరోపణలు వాస్తవమే. దళాలకు దొరికినప్పుడు సముద్రంలో పారబోసే కొకైన్‌ దెబ్బకు అక్కడి షార్క్‌ చేపల్లో కూడా దాని ఆనవాళ్లుంటున్నాయంటే అక్రమ రవాణ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. కానీ, డ్రగ్స్‌ను సముద్రంలో పట్టుకొని.. నిందితులను అరెస్టు చేయడానికి ఇంత భారీ సంఖ్యలో యుద్ధనౌకలు, ఫైటర్‌జెట్‌లు అవసరమా? అన్నదే సందేహాస్పదం. వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనుజువెలాలో ఉన్నట్లు నిర్ధరణ అయింది. స్టాటిస్టికల్‌ రివ్యూ ఆఫ్‌ వరల్డ్‌ ఎనర్జీ లెక్కల ప్రకారం 2021 నాటికి ఈ దేశంలో 48 వేల మిలియన్‌ టన్నుల చమురును గుర్తించారు. ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ చమురులో 17శాతానికి సమానం. కానీ, ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా కేవలం 0.8శాతమే. అమెరికా (USA) అక్కడి ప్రభుత్వ రంగ కంపెనీ పెట్రోలియస్‌ డె వెనుజువెలా ఎస్‌ఏపై ఆంక్షలు విధించడమే దీనికి కారణం. అగ్రరాజ్యంతో పాటు కెనడా, ఐరోపా సమాఖ్య తదితర దేశాలు కలిసి 350 ఆంక్షలు విధించాయి.

USA – వెనుజువెలాపై ఎప్పటి నుంచో ట్రంప్‌ కన్ను !

ట్రంప్‌ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ‘వెనుజువెలాలో చమురు రిజర్వులను అమెరికా స్వాధీనం చేసుకోవాలి’అని అన్నారు. 2017లో ఓ ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుజువెలాపై ఎందుకు యుద్ధం చేయడంలేదని ప్రశ్నించారు. ‘‘వాళ్ల వద్ద చాలా చమురు ఉంది. భౌగోళికంగా మనకు చాలా దగ్గర’’ అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా మదురో సర్కారును కూల్చేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు. 2023లో ఉత్తరకరోలినా రిపబ్లికన్‌ పార్టీ సభలో ప్రసంగిస్తూ ‘‘నేను గతంలో పదవిని వీడే సమయానికి వెనుజువెలా కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. మేము దానిని ఆక్రమించుకొనే వాళ్లం. దాని చమురు మొత్తాన్ని తీసుకొనే వాళ్లం. ఇప్పుడు దాని నుంచే చమురు కొంటున్నాం’’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ మనసులో ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందనడానికి ఇదే నిదర్శనంగా నిలిచింది. అప్పట్లో అమెరికా ఎన్‌ఎస్‌ఏ హెచ్‌.ఆర్‌. మెక్‌మాస్టర్‌ సహా పలువురు మంత్రులు ట్రంప్‌ ఆలోచనను వ్యతిరేకించారు.

అమెరికా సైనిక శక్తిని ఎదుర్కోగలదా ?

అమెరికాతో పోలిస్తే వెనుజువెలా సైన్యం చాలా చిన్నది. 1,23,000 మంది సైనికులు, 8,000 మంది రిజర్విస్టులు, 2,20,000 మంది పౌర సైన్యం ఉంది. అమెరికాతో 80లక్షల మంది పౌరులను సిద్ధం చేస్తానంటూ మదురో ఇటీవలే ప్రకటించారు. కానీ, ఇది సాధ్యమయ్యేపనికాదు. సుఖోయ్‌-30, 1980ల నాటి ఎఫ్‌-16, ఇరాన్‌ డ్రోన్లు ఉన్నాయి. మొత్తం 229 యుద్ధ విమానాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఆయుధ సంపద కలిగిన అమెరికా వద్ద వివిధ రకాల 13,000 విమానాలున్నాయి. చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాలున్నా.. భౌగోళికంగా దూరంగా ఉండటంతో అవి ఎంతవరకు వెనుజువెలాను ఆదుకుంటాయో చెప్పలేని పరిస్థితి.

Also Read : Anakapalli: రిమాండ్ ఖైదీల పరారీలో వెలుగులోనికి సంచలన విషయాలు

Leave A Reply

Your Email Id will not be published!