MLC Botcha Satyanarayana: శాసన మండలి నుండి వైసీపీ వాకౌట్
శాసన మండలి నుండి వైసీపీ వాకౌట్
Botcha Satyanarayana : ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నలకు చాలా బాధ్యతరాహిత్యంగా సమాధానాలు వచ్చాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… ‘‘ప్రభుత్వం,మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోంది. ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు. ప్రజలకు మంచి జరిగేందుకు పోరాటం చేయడం మా బాధ్యత. కల్తీ మద్యం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మద్యం ఏరులైపారుతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం లేదు. తిరుపతి,సింహాచలం ఘటనలు ప్రభుత్వనిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే డొంకతిరుగుడు సమాధానం ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడాన్ని విమర్శిస్తున్నారు.
MLC Botcha Satyanarayana Comments
మేం ఎంతో హుందాగా ప్రశ్నలు అడిగాం. కానీ మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. తిరుపతి,సింహాచలం ఘటనలతో ప్రభుత్వం ,మంత్రికి సంబంధం లేదా?. ఈ ప్రభుత్వానికి.. ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదు. ఎంత సేపూ కుర్చీ కోసమే ఆరాటం. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే అంశాలనే మేం తీసుకుంటున్నాం. మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని రెండు రోజుల నుంచి పదిరోజులకు మార్చామని విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి రాజీనామా చేయాలి’’ అని బొత్స డిమాండ్ చేశారు.
Also Read : Konidela Nagababu: తొలిసారి మండలిలో అడుగుపెట్టిన నాగబాబు
