Ex DSP Nalini: మాజీ డీఎస్పీ నళినిని కలిసిన కలెక్టర్ ! ఎందుకంటే ?
మాజీ డీఎస్పీ నళినిని కలిసిన కలెక్టర్ ! ఎందుకంటే ?
Ex DSP Nalini : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నళినిని (Ex DSP Nalini) యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వివరించారు కలెక్టర్. సర్వీసు ఇష్యూలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన సందేశాన్ని నళినికి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
ఈ సందర్భంగా నళిని చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు. గతంలో వైద్యపరంగా అయిన ఖర్చులను సైతం సీఎం సహాయ నిధి నుంచి ఇస్తామని, ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామని సీఎం చెప్పమన్నారని తెలిపారు. అయితే, తాను ఆయుర్వేద వైద్యం, యోగాతో కోలుకుంటున్నాని… పెద్దగా ఖర్చేమీ కాలేదని నళిని చెప్పారని కలెక్టర్ తెలిపారు. సర్వీస్ నిబంధనల గురించి ఆమె కోరగా.. ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
Ex DSP Nalini – నాకు రావాల్సింది ఇవ్వాలి – నళిని
నళినిని కలెక్టర్ కలవడానికి ముందు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆశ కల్పించారు. నా 16 పేజీల లేఖను చెత్తబుట్టలో వేశారు. తెలంగాణ డీజీపీని సీఎం రేవంత్‌రెడ్డి కలవమన్నారని చెబితే… నేను వెళ్లి కలిశాను. నాకు రావాల్సింది ఇవ్వమన్నాను… కానీ భిక్ష అడగలేదు. 2011లో ప్రజల గురించి ఆలోచించి జై తెలంగాణ అని ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత నన్ను సస్పెండ్ చేశారు. నాకు రావాల్సింది ఇవ్వడానికి ఇన్నేళ్లుగా నేను ఎదురుచూడాల్సి వచ్చింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు నళిని.
మరణ వాగ్మూలం అంటూ నళిని ప్రకటన
అయితే, నళిని గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఆదివారం తన మరణ వాగ్మూలం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డిని తాను గతంలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో తాను పోరాడిన విధానం గురించి ఆమె తెలిపారు. తనకు రావాల్సింది ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు నళిని.
Also Read : Sammakka Sagar Project: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ గ్రీన్ సిగ్నల్
