Batthula Prabhakar: ఏపీలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ పరారీ

ఏపీలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ పరారీ

Batthula Prabhakar : పోలీసులపై కాల్పులు జరిపి అరెస్ట్ అయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ (Batthula Prabhakar)… పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్నాడు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి వాయిదా కోసం విజయవాడ తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తుండగా సోమవారం రాత్రి 7.30గంటలకు దేవరపల్లి మండల దుద్దుకూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని ప్రభాకర్ (Batthula Prabhakar) పరారయ్యాడు. దీనితో అలర్ట్ అయిన పోలీసులు… నిందితుడు ఫోటోలను మీడియాకు విడుదల చేసారు. ప్రభాకర్ పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్‌ కప్స్, వైట్‌ కలర్‌ టీ షర్ట్, బ్లాక్‌ కలర్‌ ట్రాక్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని దేవరపల్లి ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. పై ముద్దాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 94407 96584 (ఇన్‌స్పెక్టర్‌ దేవరపల్లి), 94407 96624 (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవరపల్లి) ఫోన్‌ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని తెలిపారు.

గత ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ఓ పబ్‌ లో పోలీసులపై ప్రభాకర్‌ కాల్పులు జరిపాడు. దీనితో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్‌ జిల్లా సీపీ సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి తీసుకొని వెళ్తున్న క్రమంలో దుద్దుకురు వద్ద పోలీసుల కళ్లు గప్పి బత్తుల ప్రభాకర్‌ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణకరరావు, షడ్రక్‌లను సస్పెండ్ చేస్తూ సీపీ రాజశేఖర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Batthula Prabhakar – బత్తుల ప్రభాకర్‌ కోసం 15 బృందాలతో గాలింపు

పోలీసుల ఎస్కార్ట్‌ నుంచి తప్పించుకున్న కరడుగట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్‌ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలింపు కొనసాగుతోంది. అతడిని పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 40 మంది సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు కొవ్వూరు డీఎస్సీ జి.దేవకుమార్‌ తెలిపారు. ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌ కూడా పంపించినట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రభాకర్‌ను పట్టుకుంటామన్నారు.

ఏం జరిగిందంటే ?

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద సోమవారం రాత్రి బత్తుల ప్రభాకర్‌ (Batthula Prabhakar) తప్పించుకుని పారిపోయాడు. రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రభాకర్… మరో ఇద్దరు గంజాయి నిందితులను సోమవారం ఉదయం విజయవాడలోని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. విజయవాడకు చెందిన ఓ ఏఎస్సై, ఇద్దరు ఎస్కార్ట్‌ సిబ్బంది వారిని తిరిగి తీసుకువస్తున్న క్రమంలో గంజాయి నిందితులిద్దరికీ కలిపి సంకెళ్లు వేయగా, ప్రభాకర్‌ రెండు చేతులకు కలిపి సంకెళ్లు వేశారు. దారిలో దుద్దుకూరులోని రోడ్డు పక్కన హోటల్‌ వద్ద వాహనం ఆపారు. మూత్రం వస్తుందని ప్రభాకర్‌ చెప్పడంతో అతడి కుడి చేతి సంకెళ్లు తొలగించగా… పొలాల్లోకి దూకి పారిపోయాడు. పది నిమిషాల్లో కారాగారానికి చేరుకుంటారనగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

చిత్తూరుకు చెందిన ప్రభాకర్‌… విద్యా సంస్థలు, ఆసుపత్రులే లక్ష్యంగా చోరీలు చేస్తుంటాడు. ఇతడిపై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో 42 కేసులు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 44 వరకు కేసులున్నాయి. అతడు గతంలోనూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడు. అయినా అతడిని తరలించే క్రమంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Also Read : Minister Satya Kumar: గిరిజన ప్రాంతాల్లో 90% వైద్యుల పోస్టుల భర్తీ – మంత్రి సత్యకుమార్

Leave A Reply

Your Email Id will not be published!