Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ – పవన్‌కల్యాణ్
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ - పవన్‌కల్యాణ్
Pawan Kalyan : కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. ప్రస్తుతం శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను. వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాను. ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను.
కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. దీనిలో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించాం. సమస్యల పరిష్కారంతోపాటు జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా ఈ కమిటీ దృష్టిపెడుతుంది. నష్ట పరిహారం మదింపు గురించి చర్చిస్తుంది. మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను కమిటీ సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని పవన్ పేర్కొన్నారు.
Pawan Kalyan Key Comments
ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించామని పవన్ (Pawan Kalyan) తెలిపారు. మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించానని… ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించానని పేర్కొన్నారు. మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్ట జీవులకు భరోసా కల్పిస్తుందన్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని పవన్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని ఆయన తెలిపారు.
Pawan Kalyan – రెండో రోజూ కొనసాగుతున్న మత్య్సకారుల ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప్పాడలో మత్స్యకార కుటుంబాలు చేపట్టిన నిరసనలు రెండోరోజు కూడా కొనసాగాయి. ఉదయం 6 గంటల నుంచి కూడలి సమీప ప్రాంత రహదారులన్నీ మూసివేసి మత్స్యకారులు ధర్నా చేపట్టారు. కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేశారు. దుకాణాలు తెరవద్దని యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మత్స్యకారుల వద్దకు జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ వెళ్లి చర్చించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున ఆయన హామీ ఇచ్చారు.
Also Read : High Court: జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్ పై స్పీకర్‌కు నోటీసులు
