Shivadhar Reddy: తెలంగాణా డీజీపీగా శివధర్‌రెడ్డి

తెలంగాణా డీజీపీగా శివధర్‌రెడ్డి

Shivadhar Reddy : తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ స్థానానికి పలువురు ఐపీఎస్‌ ఉన్నతాధికారుల పేర్లు వినిపించినా ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన శివధర్‌రెడ్డిని (Shivadhar Reddy) డీజీపీ(సమన్వయం)గా నియమిస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హెడ్‌ ఆఫ్‌ ది పోలీస్‌ ఫోర్స్‌(హెచ్‌వోపీఎఫ్‌)గా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్‌ ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ పొందనున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తనను డీజీపీగా నియమించినందుకు శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డినికలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Shivadhar Reddy – లాయర్‌ నుండి ఐపీఎస్‌ గా మారిన శివధర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్‌(పెద్దతూండ్ల) గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివిన అనంతరం కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. సివిల్స్‌ రాసి 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌గా అఖిలభారత సర్వీసుల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరంగా కీలకమైన సౌత్‌జోన్‌ డీసీపీగా విధులు నిర్వర్తించారు. 2007లో మక్కామసీదు బాంబు పేలుళ్లతోపాటు ఆ సమయంలో జరిగిన అల్లర్ల నియంత్రణ క్రమంలో జరిగిన పోలీస్‌ కాల్పుల్లో 14 మంది మరణించిన అనంతరం అప్పటి ప్రభుత్వం ఆయన్ని అక్కడ నియమించింది. 2003లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా కొసావోలో విధులు నిర్వర్తించారు. డీఐజీగా పదోన్నతి పొందిన అనంతరం స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) చీఫ్‌గా నియమితులయ్యారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీలో అదనపు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన అక్కడే ఐజీ హోదాలో డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ సమయంలో వైజాగ్‌ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను అప్పటి సీఎం కేసీఆర్‌ తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించారు. ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నపుడు నయీంను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారు. 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మరోసారి ఆయన్ని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించారు. అక్కడ ఉండగానే గతేడాది ఆగస్టులో ఆయన డీజీపీగా పదోన్నతి పొందారు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌లో ఆయన పనితీరుకు శౌర్యపతకం, ఐపీఎం, పీపీఎం పురస్కారాలు లభించాయి.

కవయిత్రి ఎన్‌ అరుణ కన్నుమూత

కవయిత్రి, ఆచార్య ఎన్‌ గోపీ జీవిత సహచరి అరుణ(77) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం రామాంతపూర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అరుణ స్వస్థలం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో సహాధ్యాయులైన గోపీ, అరుణలది ప్రేమ వివాహం. వీరి కుమారుడు చైతన్య. వివాహానంతరం పూర్తిగా కుటుంబ బాధ్యతలకు అంకితమైన అరుణ ఐదు పదుల వయసు దాటిన తర్వాత కవిత్వం రాయడం ప్రారంభించారు. సినారె లాంటి ప్రసిద్ధ కవులు ఆమె కవిత్వాన్ని ప్రశంసించారు. ’మౌనమూ మాట్లాడుతుంది’, ’సూది నా జీవన సూత్రం’, పాటల చెట్టు, కవితా సంపుటాలుగా వెలువడ్డాయి. ఆమె సాహిత్య సృజనకు గాను ఉత్తమ కవయిత్రిగా పలు అవార్డులు వచ్చాయి. అరుణ అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు అంబర్‌ పేట శ్మశాన వాటికలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Also Read : Telangana Government: బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

Leave A Reply

Your Email Id will not be published!