TTD: వయో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు – టీటీడీ
వయో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు - టీటీడీ
TTD @ వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. వయో వృద్ధుల దర్శనంపై తప్పుదోవ పట్టించేలా సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అసలు వాస్తవం ఏమిటంటే.. రోజూ 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ (TTD) మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తుంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తుంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి దర్శనానికి వారిని అనుమతిస్తారు’’ అని టీటీడీ స్పష్టం చేసింది. అందువల్ల సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే తప్పుడు వార్తలు, వదంతులను నమ్మొద్దని తితిదే విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సంప్రదించాలని అధికారులు కోరారు.
TTD – అది టీటీడీ రహదారి కాదు
తిరుమల వెళ్తున్న భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని సైతం టీటీడీ ఖండించింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద మద్యం తాగి మత్తులో మందుబాబులు ఆ సీసాలను పగులగొట్టి వేశారంటూ కొందరు అవాస్తవ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలు రోడ్డుపై విసిరి వేశారని తెలిపింది. వాస్తవానికి అది టీటీడీ (TTD) రహదారి కాదని పేర్కొంది. అయినా కొందరు అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తులకు ఇబ్బంది అని వక్రీకరిస్తున్నారని మండిపడింది. ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది.
తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటు – మంత్రి సవిత
ప్రఖ్యాతగాంచిన తిరుపతి పట్టణంలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్త కనకదాస విగ్రహాన్ని కర్నాటక బీజేపీ నాయకులు రేవణ్ణ, ఎంపీలు బీకే పార్థసారథి, బస్తిపాటి నాగరాజుతో కలిసి మంత్రి సవిత ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… నీతి నిజాయితీకి కురుబలు నిలువెత్తు నిదర్శనమన్నారు. కురుబల అభివృద్ధికి టీడీపీ (TTD) అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అన్న ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కురుబలకు రాజకీయ ప్రాధాన్యమిచ్చారన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సంజీవరెడ్డి గారి రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశమిచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో రామచంద్రారెడ్డి 14 శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు. తర్వాత ఎంపీ బీకే పార్థసారథికి కూడా టీడీపీ రాజకీయ అండ అందించిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కురుబలకు చెందిన ఇద్దరు ఎంపీలుగా, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కురుబలకు అండగా నిలిచిందన్నారు. విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇదే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి సవిత వెల్లడించారు. కురుబల ఆర్థికాభివృద్ధికి గొర్రెలు, మేకల ఫాం యూనిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. సద్గురు నిరంజన మహానంద స్వామీ, కురుబ సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : MLA Defection Case: పార్టీ ఫిరాయింపు కేసులో పూర్తయిన ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్
