బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్దరామయ్య ను మారుస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈతరుణంలో దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి సిద్దరామయ్య, నేను కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సరైన సమయంలో అది సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పార్టీలో ఎటువంటి సమస్యలూ లేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఏ నిర్ణయం అయితే జరిగిందో, అది ఆ ప్రకారమే అమలవుతుందని డి.కె. శివకుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నాయకత్వ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానన్నారు. తాను ముందు నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ తాను ఏనాడూ పార్టీ లైన్ దాటలేదని చెప్పారు డీకే శివకుమార్. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అలాగే కర్ణాటకలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడే మే 4వ తేదీ తర్వాత, రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో శివకుమార్ చేసిన కామెంట్స్ తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
