10న చంద్రగిరిలో దీప పూజకు భారీ ఏర్పాట్లు

చేస్తున్నామ‌న్న టీటీడీ జేఈవో డాక్ట‌ర్ శ‌ర‌త్

తిరుపతి : చంద్రగిరి లోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో జూలై 10వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న పవిత్ర దీపపూజ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ . ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని స్ప‌ష్టం చేశారు. ఆయన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. దీప పూజలో పాల్గొనే భక్తుల కోసం తగిన సంఖ్యలో షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను సమృద్ధిగా ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు సౌకర్యవంతంగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని జేఈవో సూచించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన జేఈవో వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ మనోహరం, ఈఈ మల్లికార్జున ప్రసాద్, డీఈ (ఎలక్ట్రికల్) సరస్వతి, విజిఓ గిరిధర్, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఎస్‌వీబీసీ సీపీఓ శ్రీ శ్రీ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం జేఈవో డాక్ట‌ర్ శ‌ర‌త్ మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు తిరుమ‌ల‌తో పాటు అనుబంధ ఆల‌యాల‌కు పెద్ద ఎత్తున భ‌క్త బాంధ‌వులు త‌ర‌లి వ‌స్తున్నార‌ని చెప్పారు. తాజాగా అప్ప‌లాయ‌గుంట‌లో నిర్వ‌హించిన వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం అయ్యాయ‌ని తెలిపారు. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. టీటీడీ తాజాగా చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాసం కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింద‌ని, దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు శ‌ర‌త్.

Leave A Reply

Your Email Id will not be published!