హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు సినీ లెజెండ్స్ తలైవా రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలపై పడింది. దీనికి కారణం ఈ ఇద్దరూ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వర ప్రసాద్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే తను నటించిన జైలర్ దుమ్ము రేపింది. రికార్డులను బద్దలు కొట్టింది. ఆశించిన దానికంటే తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ -2 వస్తోంది. అటు విశ్వంభర ఇటు జైలర్ -2 మూవీస్ ఆఖరు దశలో ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఇక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు దసరా సెంటిమెంట్ కావడంతో విశ్వంబర, జైలర్ -2 చిత్రాలు దసరా సీజన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. దీంతో రజనీకాంత్, చిరంజీవిల మూవీస్ కాస్త అటు ఇటుగా రిలీజ్ కానున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రముఖ పంపిణీదారుల సమాచారం ప్రకారం,ఈ రెండు భారీ చిత్రాలు కేవలం ఒక రోజు తేడాతో విడుదలయ్యేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ‘జైలర్ 2’ అక్టోబర్ 15న, ‘విశ్వంభర’ అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలు గనుక అనుకున్న తేదీలకే విడుదలయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇది దిగ్గజాల మధ్య పోరుగా మారుతుంది. ఈ రెండు చిత్రాలపై దాదాపు రూ. 300 కోట్ల థియేట్రికల్ వ్యాపారం ఆధారపడి ఉంది,
కాబట్టి ఇది ఇటీవలి కాలంలోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ పోరులలో ఒకటిగా నిలుస్తుంది అని ఒక ప్రముఖ పంపిణీదారు పేర్కొన్నారు. రెండు చిత్రాలు భారీ సంఖ్యలో ప్రీమియం స్క్రీన్‌లను కోరుకునే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా థియేటర్ల కేటాయింపు, షో సమయాలు , ఆదాయ పంపిణీ వంటివి పెద్ద సవాళ్లుగా మారనున్నాయి.
