కడప జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. మరో వైపు 16 వేల కోట్లకు పైగా ఖర్చుతో కడప జిల్లాలో భారీ ఉత్పత్తిని చేసే జేఎస్ డబ్ల్యూ కంపెనీకి సంబంధించిన ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు.
ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. జై అమరావతి నినాదం ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సభకు విచ్చేసిన జనత జై అమరావతి అంటూ నినదించింది. రాష్ట్ర ప్రజలంతా గర్వంగా కాలరెగరేసి చెప్పుకునేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి సమావేశంలో ప్రకటించారు. గత పాలకులు విధ్వంసమే అజెండా పనిచేశారని.. విశ్వసనీయత లేని పార్టీకి విలువలూ లేవని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిగా అంగీకరించి అధికారంలోకి కాగానే మూడు ముక్కలాట ఆడారని అన్నారంటూ ఆరోపించారు.
కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారని… నిన్న విజయవాడ అన్నారని రేపు ఏమంటారో తెలీదని సీఎం ఎద్దేవా చేశారు. నమ్మకంతో, విశ్వాసంతో పాలన అందిస్తున్నాం కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని సీఎం హితవు పలికారు. గత పాలనలో మన రాజధాని ఏమిటో ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని అన్నారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్రాన్ని, ప్రజల్ని తీవ్రంగా నష్ట పరిచారని ఆక్షేపించారు.
