అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ పంట నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ లో ఉందని చెప్పారు. ఖరీఫ్-2026లో ఇంతవరకు 11.75 లక్షల ఎకరాలలో సాగు అయినప్పటికీ, ఈ-పంట నిబంధనల ప్రకారం 30 రోజుల వయసు దాటిన పంటలనే నమోదు చేయవలసి వుంటుందన్నారు. ఇంతవరకు 1,62,396 మంది రైతులకు సంబంధించిన 4,03,150 ఎకరాలను ఈ-పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా సేకరించిన పంట విస్తీర్ణ వివరాలు అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నందున, పంటల విస్తీర్ణ ఉత్పత్తి, ఉత్పాదకత అంచనాల కోసం కేంద్ర ప్రభుత్వ గణాంక వ్యవస్థ వాటిని వినియోగించడం ఒక విశిష్టమైన గుర్తింపుగా నిలిచిందన్నారు అచ్చెన్నాయుడు.
రైతులకు సబ్సిడీలు, బీమా, పెట్టుబడి సాయం వంటి పథకాలు వేగంగా, పారదర్శకంగా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. వాస్తవాలతో సమాధానం చెప్పలేక అబద్ధాల ప్రచారం చేయడం జగన్‌కు అలవాటైందని ఆరోపించారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, ప్రచారాలతో కాదు…పనితీరుతోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచు కుంటోందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని తన హయాంలో నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు మంత్రి.
