తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తన సర్వస్వంగా భావించి, భక్తి సాహిత్యంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 20, 21 తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. 20న తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 9.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సాహిత్య సదస్సు ,సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
21న ఉదయం 9 గంటలకు ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి సమర్పిస్తారు. అదేరోజు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కచేరీ, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు హరికథ నిర్వహిస్తారు. ఇదే రోజు ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించి ఆమెకు ఘన నివాళులు అర్పించనున్నారు.
వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి ఆలయంలో ఆగస్టు 21న సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమం, హరికథ జరుగుతుంది. తరిగొండ వెంగమాంబ క్రీ.శ. 1730లో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో కలిగిన సంతానం కావడంతో ఆమెకు ‘వెంగమాంబ’ అనే పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది.
చిన్న వయసులోనే వివాహం జరిగినప్పటికీ, భర్తను కోల్పోయిన అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామినే తన భర్తగా భావించి సంపూర్ణంగా స్వామివారి భక్తిలో నిమగ్నమయ్యారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక, యోగ విద్యలను అభ్యసించి, భక్తి మార్గంలో విశిష్ట సాధన చేశారు. వెంగమాంబ తరిగొండలో 5, తిరుమలలో 13 గ్రంథాలను రచించారు. యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యాలు, ద్విపదలు వంటి అనేక ప్రక్రియల్లో ఆమె చేసిన రచనలు భక్తి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవ సమయంలో ‘ముత్యాల హారతి’ అనే విశిష్ట నిత్య కైంకర్యాన్ని వెంగమాంబ నెలకొల్పారు. ఆమె భక్తికి ప్రతీకగా నిలిచిన ఈ కైంకర్యం నేటికీ కొనసాగుతోంది .క్రీ.శ. 1817లో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ వెంగమాంబ సజీవ సమాధి పొందారు. భక్తి, సాహిత్యం, యోగం, ఆధ్యాత్మిక సాధనల సమన్వయంతో ఆమె జీవితం నేటికీ భక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
