పేదల గృహ నిర్మాణానికి పారిశ్రామిక రంగం మద్దతు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో సిమెంట్ బస్తా రూ.230కే

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు సొంత ఇల్లు ఉండాలనే కలను సాకారం చేసే సంకల్పంతో, ‘ప్రజా ప్రభుత్వం’ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార , పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరలను తగ్గించడంపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, ఇది పేద కుటుంబాలకు గౌరవ ప్రదమైన జీవనం, సామాజిక భద్రత , ఆత్మగౌరవాన్ని కల్పించే ఒక గొప్ప యజ్ఞం అని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వీటిలో 85 శాతం ఇళ్లకు సంబంధించి స్లాబ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో వేగంగా కొనసాగుతోందని చెప్పారు. రెండవ దశలో రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించామని వివరించారు. అదనంగా, హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అలాగే 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ‘ఇందిరమ్మ టవర్ల’ నిర్మాణాన్ని ప్రారంభించిందని తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ గృహ నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ, పేదల గృహ నిర్మాణంలో ఎటువంటి రాజీ లేకుండా, నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి లబ్ధిదారునికి సంబంధించిన నిధులను ప్రతి సోమవారం విడతల వారీగా పారదర్శకంగా విడుదల చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబం తమ సొంత ఇంట్లో నివసించే వరకు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి చిత్తశుద్ధితో నిర్వర్తిస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ ‘ఇందిరమ్మ ఇళ్ల’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన సిమెంట్‌ను తక్కువ ధరకు అందించాలని ఆయన కోరారు.

ప్రభుత్వం, పరిశ్రమలు మరియు ప్రజలు కలిసి పనిచేస్తే, గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యాన్ని త్వరగా సాధించవచ్చని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చడంలో సమాజంలోని అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు. పేదలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయం అందిస్తే, ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యాలను కూడా ప్రజలు కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!