మూలపేట జెడ్పీ స్కూల్ టీచర్లకు డిప్యూటీ సీఎం కంగ్రాట్స్
అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు గర్వంగా ఉంది
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం లోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నో అడ్మిషన్ బోర్డుపై స్పందించారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియేట్ లో కాకినాడ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించింది పిఠాపురం నియోజకవర్గం.
అత్యున్నత ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు లేవంటూ నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.ఉపాధ్యాయులు బోధన విధానాలు, బోధనేతర సిబ్బంది సహకారంతో అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేసే స్థాయికి మూలపేట ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దడానికి తోడ్పడినందుకు సిబ్బందిని ప్రశంసించారు. ఈసారి పిఠాపురం పర్యటన సందర్భంగా మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శిస్తానని డిప్యూటీ సీఎం మాటిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు… మూలపాడు జెడ్పీ హైస్కూల్ సాధించిన ఫలితాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
