ప్ర‌జాస్వామ్య గొంతుక న్యాయానికి ప్ర‌తీక‌

జ‌స్టిస్ మాధ‌వ్ జామ్దార్ కు దేశం స‌లాం

ముంబై : మ‌రాఠా (మ‌హారాష్ట్ర‌) రాష్ట్రానికి చెందిన జ‌స్టిస్ మాధ‌వ్ జామ్దార్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. ఓ కేసు విష‌యంలో ఆయ‌న ఇచ్చిన తీర్పు క‌ల‌క‌లం రేపింది. ప్ర‌త్యేకించి కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీని, మ‌హారాష్ట్రలో ప్ర‌స్తుతం పాల‌న సాగిస్తున్న మ‌హాయుతి కూట‌మి స‌ర్కార్ ను తీవ్ర స్థాయిలో మంద‌లిస్తూ జ‌స్టిస్ మాధ‌వ్ జామ్దార్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసేలా చేశాయి. ప్రధానంగా ఈ దేశంలో పౌరులను బానిస‌లుగా చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా స‌మాజంలో బాధ్య‌త‌తో ప‌ని చేయాల్సిన పోలీసులు రాజ‌కీయ పార్టీల నేత‌ల‌కు, ప్ర‌త్యేకించి పాల‌కుల‌కు జీ హుజూర్ అన‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు జ‌స్టిస్.

పౌరులు బానిసలు కాదని గుర్తు పెట్టుకోవాలి. పోలీసులు ముఖ్యమంత్రికి గానీ, ప్రధానమంత్రికి గానీ సేవకులు కారు అని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జామ్దార్ గుర్తు చేశారు. పిటిషనర్ కేవలం ‘బీజేపీ ప్రభుత్వం ముర్దాబాద్’, ‘అమిత్ షా ముర్దాబాద్’ వంటి నినాదాలు మాత్రమే చేశారు. పౌరులు అలాంటి నినాదాలు ఎందుకు చేయకూడదు? అని జ‌స్టిస్ ప్రశ్నించారు. ఇదిలా ఉండ‌గా నిక్కచ్చిగా మాట్లాడటంలో, అధికార వర్గాలను ధిక్కరించడంలో పేరు పొందిన‌ జస్టిస్ జామ్దార్, అనేక కఠినమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ హామీలను ఎలా ఉల్లంఘించారో కూడా ఆయన ఉదహరించారు.

పౌరులకు నిరసన తెలిపే హక్కు ఉందని స్ప‌ష్టం చేశారు. ఈ తీర్పు విస్తృత ప్రశంసలు పొందింది, దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల దృష్టిని ఆకర్షించింది. తీర్పు సంద‌ర్బంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సూటిగా బీజేపీని ప్ర‌శ్నించాయి. ఇదేమిటి? పౌరులందరినీ భారత ప్రభుత్వానికి బానిసలుగా చేస్తున్నారా… వారు నిరసనలు లేదా ఆందోళనలు చేయలేరా? అని సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సయీద్ అహ్మద్ చౌదరిపై బహిష్కరణ ఉత్తర్వులను రద్దు చేస్తూ జస్టిస్ జామ్దార్ ప్రశ్నించారు. అధికారిక నిర్ణయం “దురుద్దేశ పూరితమైనది” అని జస్టిస్ జామ్దార్ అభివర్ణించారు.

పిటిషనర్ తన హోదాలో వ్యవహరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా మోర్చాలు, ధర్నాలు నిర్వహించారు. మహారాష్ట్ర పోలీస్ చట్టం కింద ఒక వ్యక్తిని బహిష్కరించడానికి అది ఒక కారణంగా నిలవదు అని జస్టిస్ జామ్దార్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని 19, 21 అధికరణలను కూడా ఉటంకించారు. ఇవి పౌరులకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛనే కాకుండా, గౌరవంగా జీవించే హక్కును కూడా కల్పిస్తాయని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వపు కొన్ని నిర్ణయాలను కేవలం వ్యతిరేకించినందుకు పిటిషనర్‌పై ప్రతివాదులు తీసుకున్న చర్య అతని ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తుంది అని జస్టిస్ జామ్దార్ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ జ‌స్టిస్ జామ్దార్ ను ప్ర‌శంసించారు. ఎక్స్ వేదిక‌గా స్పందించారు. నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును న్యాయవ్యవస్థ సాధారణంగా ధృవీకరించాల్సి ఉండగా, ఇప్పుడు అది అసాధారణంగా అనిపించడం మనం జీవిస్తున్న కాలం గురించి చాలా చెబుతోంది. భిన్నాభిప్రాయాన్ని నేరంగా పరిగణిస్తూ, దానిని ఒక ప్రజాస్వామ్య హక్కుగా కాకుండా శాంతి భద్రతల సమస్యగా చూస్తున్న ఈ తరుణంలో, న్యాయవ్యవస్థ నుండి వచ్చే ఇటువంటి హెచ్చరికలు చాలా ముఖ్యమైనవి. మీకు వందనాలు, జస్టిస్ జామ్దార్అ ని ఆయన ట్వీట్ చేశారు.

అధికారంలో ఉన్నవారిని తిట్టడం చూడటానికే ఆయన కోర్టుకు హాజరు కావాలి. ఆయనకు ‘గరీబో కా మసీహా’ (పేదల ప్రవక్త) అని పిలిపించు కోవడం అంటే చాలా ఇష్టం. పేదల పక్షాన నిలబడటమంటే ఆయనకు చాలా ఇష్టం. పరారీలో ఉన్న క్యాబినెట్ మంత్రి భరత్‌శెట్ గోగావాలే కుమారుడిని కనుగొనలేక పోయామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు ఆయన ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని తిట్టారు. మరుసటి రోజు వికాస్ గోగావాలే లొంగిపోయాడు . ఇప్పుడు ఇలాంటి జ‌స్టిస్ లే ఈ దేశానికి కావాల‌న్న డిమాండ్ పెరుగుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!