అమరావతి : రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందులో భాగంగా భవిష్యత్‌లో పెరిగే ఇథనాల్ డిమాండ్‌ను అంది పుచ్చుకోవాలని చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ 40 శాతానికి పెంచితే… మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోలు, డీజిల్‌లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందన్నారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్‌కు సంబంధించి పాలసీ తీసుకు రావాలని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్దేశించారు.
సచివాలయంలో మంగళవారం 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,076.11 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. దీంతో 10,531 ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నాయి. పర్యాటకరంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. తిమ్మమ్మ మర్రిమాను సహా రాష్ట్ర వ్యాప్తంగా 100 టూరిస్ట్ స్పాట్‌ల దగ్గర ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు సీఎం. పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు, లంబసింగి లాంటి ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. లంబసింగి, అరకు సమీపంలో రిసార్ట్ ఏర్పాటుకు జిందాల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేస్తోందని చెప్పారు.
ఏటికొప్పాక, కొండపల్లి , ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు కళారూపాల్ని కూడా తీర్చిదిద్దాలి. ఇందుకోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. నేచర్, వాటర్, అమ్యూజ్మెంట్ పార్కులను అనుసంధానించాలి. సూర్యలంక మాస్టర్ ప్లాన్ త్వరితగతిన రూపొందించాలి. కుప్పంలో కంగుంది కోట, చిత్తూరు జిల్లాలో ఎలిఫెంట్ సఫారీ వంటివి అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా పర్యాటక రంగం నుంచి జీఎస్‌డీపీకి వాటా పెరిగేలా చూడాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవసరమైన హోటల్ గదులు పెద్దఎత్తున వస్తున్నాయని సీఎం అన్నారు. 2024లో 4,390 హోటల్ రూములు ఉంటే… ఈ రెండేళ్లలో 9,364 హోటల్ రూముల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. దీంతో రాష్ట్రంలో 13,753 హోటల్ రూములు అందుబాటులోకి వస్తుండగా… దీనికి కృషి చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.