విశ్రాంతి అవసరమున్నా వస్తానంటున్న పవన్ కళ్యాణ్
ముంబై ఆస్పత్రిలో పరామర్శించిన చంద్రబాబు నాయుడు
ముంబై : ముంబై ఆస్పత్రిలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం. పవన్ కు శస్త్ర చికిత్స జరిగిందని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ వెంటనే విధుల్లోకి వచ్చేస్తానంటున్నారని తాను వద్దని చెప్పానని పేర్కొన్నారు. మూడు వారాల ఫిజియోథెరపీ ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇప్పుడు తనకు పూర్తిగా విశ్రాంతి అవసరమని అన్నారు. *ఆరు నెలల తర్వాత రెండో భుజానికి పరీక్షలు చేస్తారని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తన అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు చంద్రబాబు నాయుడు.
ప్రజా క్షేత్రంలోకి ఉప ముఖ్యమంత్రి నూతనోత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు. ఆయనకు చాలా కీలకమైన శస్త్ర చికిత్స జరిగింది. మూడున్నర గంటలపాటు అత్యున్నత వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఏళ్ల తరబడి ఉన్న తీవ్రమైన గాయాన్ని ఆయన ప్రజాసేవలో నిమగ్నమై నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని సీఎం చెప్పారు. ముంబయిలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యల పర్యవేక్షణలో ఉన్నారు. తనతో పాటు డిప్యూటీ సీఎంను మంత్రులు పొంగూరు నారాయణ, అనగాని సత్య ప్రసాద్ కూడా పరామర్శించిన వారిలో ఉన్నారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తో ఆస్పత్రిలోనే మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ లింగమనేని రమేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు చంద్రబాబు నాయుడు.
