చంద్రబాబు పై గన్నవరం ఎమ్మెల్యే గుస్సా

ప్ర‌త్య‌ర్థుల‌ను ప్రోత్స‌హిస్తూ ప‌నులు ఇస్తే ఎలా

అమ‌రావ‌తి : అన్నీ తానై , దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తూ వ‌స్తున్న టిడిపీ చీఫ్‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు సోమ‌వారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నా ప్రత్యర్ధులతో కలిసి పనిచేసిన పారిశ్రామిక వేత్తలకు పెద్ద పీట వేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇది ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నించారు. కేఎంవీ అనే సంస్థకు ఎయిర్ పోర్టు టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడం పై యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాంటి నిర్ణ‌యాలు వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే నాకిచ్చే గిఫ్ట్ ఇదేనా అని నిల‌దీశారు. ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు..ఇది క్షమార్హం కాద‌న్నారు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.

నా రెక్కల కష్టం ఖర్చు చేస్తే మీరు నన్ను అవమానాల పాలు చేస్తారా అంటూ ఆవేద‌న వ్యక్తం చేశారు.నా నియోజకవర్గంలో అవినీతి జరిగితే కచ్చితంగా ఎండగడతాన‌ని, ఎవరినీ ఉపేక్షించను అని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. త‌న‌ను ఏరోజూ కలవని వారు ఈ రోజు టిడిపి పార్టీ అని చెప్పుకుంటున్నారని, దీని వెనుక ఎవ‌రు ఉన్నారో తేల్చాల్సిన బాధ్య‌త మీపై లేదా అని అన్నారు. కోటి , రెండు కోట్ల విరాళాలు ఇచ్చి పనులు చేయించుకునే వారికి చరమగీతం పాడాలని డిమాండ్ చేశారు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు. గన్నవరంలో నా హక్కుల విషయంలో నేను రాజీ పడను అని స్ప‌ష్టం చేశారు. ప్రోటోకాల్ పరంగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఊరుకునేది లేదన్నారు. త్వరలో కార్యకర్తల మీటింగ్ పెడతానని. ఆరోజు అన్నీ మాట్లాడతాన‌ని ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your Email Id will not be published!