విద్యా శాఖ టి శాట్ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం

సంత‌కాలు చేసిన డైరెక్ట‌ర్ , సీఈఓలు

హైద‌రాబాద్ : విద్యా ప్రసారాల కోసం పాఠశాల విద్యాశాఖ, టి – శాట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, టి శాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల రెడ్డిల సంతకాలు చేశారు. ‘తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం’, ’10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక ఆన్‌లైన్ డిజిటల్ తరగతులు నిర్వ‌హించ‌నున్నారు. అంతే కాకుండా టిఎల్ఎం మేళా, టి శాట్ వేదిక ద్వారా టీచ‌ర్ల‌కు ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఒప్పంద పత్రాల మార్పిడి జ‌రిగింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎల్లప్పుడూ ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ కంటెంట్‌ను అందించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ, T-SAT మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో వాటిని పరస్పరం మార్చుకున్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో డిజిటల్ అభ్యాసం ఎంతో ఉపయోగ పడుతుందని నవీన్ నికోలస్, వేణుగోప‌ల్ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాలపై కుదిరిన ఈ ఒప్పందం వల్ల ప్రసారాలకు సంబంధించి కార్యక్రమాల నిర్వహణలో స్పష్టత ఉంటుందని వారు భావిస్తున్నారు.

9, 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాల ప్రసారం; రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28,000 పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులతో డీఈఓల‌ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఫేస్-టు-ఫేస్’ ‘అవర్ డిస్ట్రిక్ట్ – అవర్ స్కూల్’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు; అలాగే ఉపాధ్యాయుల కోసం టీఎల్ఎం మేళా’ వంటి కార్యక్రమాలను ఇకపై టి శాట్ వేదిక ద్వారా ప్రసారం చేయనున్నారు. ఈ ప్రక్రియకు ఈ ఒప్పందం ఎంతో ఉపయోగ పడుతుందని విశ్వసిస్తున్నారు.సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ , ఇతర విభాగాలకు సంబంధించిన డిజిటల్ ప్రసార కార్యక్రమాలన్నీ T-SAT ద్వారానే నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ ఒప్పంద కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ అదనపు డైరెక్టర్ పి.వి. శ్రీహరి, టి శాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండి సాదిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, ప్రాజెక్ట్ జాయింట్ డైరెక్టర్లు , కోఆర్డినేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!