యుద్ద ప్రాతిప‌దిక‌న పున‌రావాస చ‌ర్య‌లు చేప‌ట్టాలి

సీఎస్ ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో కీల‌క ఆదేశాలు జారీ చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న‌ భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటల మునకపై సీఎస్ సాయిప్రసాద్ సహా ఉన్నతాధికారులతో స‌మీక్షించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో పునరావాస చర్యలను సీఎంకు వివరించారు అధికారులు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్ల లేకపోయిన మత్సకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని సీఎం దృష్టికి తెచ్చారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ఆయా జిల్లాల్లో రిజర్వాయర్లలో నీటి ప్రవాహాల గురించి ఆరా తీశారు.

హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు తక్షణం ఈ ప్రక్రియ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో చేప‌ట్టిన ఎత్తిపోత‌ల ప‌థ‌కం పనులు పూర్తి చేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్లోకి తరలించాని స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేదుకు తీసుకున్న చర్యలపై అధికారులతో మాట్లాడారు సీఎం. కృష్ణానదిలో పైనుంచి ప్రవాహాలు లేవని… స్థానికంగా వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీళ్లు పెరిగాయని తెలిపారు నీటి పారుద‌ల శాఖ అధికారులు.

స్థానికంగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్ కు ఎగువన బ్యారేజ్ నిర్మాణం అవసరమని పేర్కొన్నారు చంద్ర‌బాబు నాయుడు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, ప్రకాశం దిగువన రెండు బ్యారేజ్ లు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31 శాతానికి తగ్గిందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!